యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ బడ్జెట్ లో ప్రయత్నాలు చేయడం అవసరమే. కానీ కథల విషయంలో సరైన లెక్కలు, స్క్రిప్ట్ రాతలో హెచ్చుతగ్గులు చూసుకోకపోతే మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు. తాజాగా విడుదలైన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ దీన్ని ఋజువు చేస్తోంది. కొత్త తరం ఆడియన్స్ కోసమే తీశామని నిర్మాత పదే పదే చెప్పినా వాళ్ళు కూడా థియేటర్లకు వచ్చిన దాఖలాలు తక్కువ.
రెండు వారాల క్రితం సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా వ్యవహరించిన రోమాంచకం కూడా ఇదే రిజల్ట్ చూసింది. ఒక కమెడియన్ ని హైలైట్ చేసుకుని అసలైన హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ని సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో యూత్ కూడా లైట్ తీసుకున్నారు. ఫలితంగా మొదటి వారంలోనే పూర్తిగా నెమ్మదించిపోయి సెలవు తీసుకుంది. డిజిటల్, ఓటిటి హక్కుల రూపంలో రికవరీ అయ్యుండొచ్చు కానీ థియేటర్ కోణంలో చూసుకుంటే మటుకు రోమాంచకం సక్సెస్ ఫుల్ గా నిలవలేకపోయింది.
ఇవే కాదు 2026 సంవత్సరంలో ఇలాంటివి చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చాయి. నందు సైక్ సిద్దార్థ, గుణశేఖర్ యుఫోరియా, విశ్వక్ సేన్ ఫంకీ, సుహాస్ హే బలవంత్, హార్ష్ రోషన్ బ్యాండ్ మేళం, సుమంత్ ప్రభాస్ గోదారి గట్టుపైన, హర్షిత్ రెడ్డి దీవానా మొదలైనవన్నీ కమర్షియల్ గా ఎలాంటి మేజిక్ చేయలేకపోయాయి. వీటిలో ఒకటి రెండు డీసెంట్ టాక్ తెచ్చుకుని సోషల్ మీడియా సపోర్ట్ అందుకున్నప్పటికీ నిర్మాతకు దక్కాల్సిన ఫైనల్ రెవిన్యూని ఇవ్వలేకపోయాయి.
అలాని సక్సెస్ లేనివి లేదని కాదు. చెన్నై లవ్ స్టోరీ మీద ఓటిటిలో కామెంట్స్ వచ్చినా థియేట్రికల్ గా వర్కౌట్ అయ్యింది. నలభై కోట్లకు పైగా వసూలు చేసింది. దాన్ని వద్దనుకుని ఎపిక్ చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలకు చేదు అనుభవం మిగిలిపోయింది. ఎలివేషన్లు, హీరోయిజంలు, ఫాంటసీ డ్రామాలు ఎక్కువగా ఆడుతున్న ట్రెండ్ లో ప్రేమకథలతో, రామ్ కామ్ లతో మెప్పించడం అంత సులభం కాదు. చాలా హోమ్ వర్క్ చేసుకుంటే తప్ప వాటితో సక్సెస్ కొట్టలేని పరిస్థితి నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates