దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిజ జీవిత భార్యా భర్తలయ్యాక రిలీజవుతున్న మొదటి మూవీగా అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. దానికి తగ్గట్టే ఈ జంట ప్రమోషన్ వీడియోలలో తమ బంధం ఎంత బలంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్ దృష్ట్యా దీనికి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే ప్రచారం హఠాత్తుగా మొదలయ్యింది.
దీనికి మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ ఎలాంటి హైక్స్ ఉండవని, రెగ్యులర్ ధరలకే గొప్ప అనుభూతిని పొందవచ్చని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అంటే తెలంగాణ మల్టీప్లెక్సులో గరిష్టంగా 295, ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా 177 రూపాయలకు ఈ సినిమాని చూసేయొచ్చు. సింగల్ స్క్రీన్లలో మరింత అందుబాటులో రేట్లు ఉంటాయి. ఇలాంటి స్ట్రాటజీ ఎంత మేలు చేస్తుందో ఆల్రెడీ ఇరుముడి నాలుగు వారాలుగా ఋజువు చేయడం చూస్తున్నాం.
స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక కరువు ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ కథను రాసుకున్నారు. టీజర్ లో కంటెంట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ శాంపిల్ చూపించారు. అసలు సినిమాలో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఊహకందని స్థాయిలో ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఫ్రెష్ గా ఇంటెన్స్ గా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెబుతున్నారు.
ఆదర్శ కుటుంబం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రణబాలికి ఉన్న ఏకైక కాంపిటీషన్ జైలర్ 2 ఒకటే. ఒకవేళ ఆ సినిమా కనక టికెట్ రేట్ల పెంపుకి మొగ్గు చూపితే అది విజయ్ దేవరకొండకు అడ్వాంటేజ్ అవుతుంది. రెగ్యులర్ ధరలు ఉంటాయి కాబట్టి ఆడియన్స్ ప్రాధాన్యత రణబాలికే ఎక్కువ ఉండొచ్చు. టాక్ పాజిటివ్ గా వస్తే మటుకు కలెక్షన్ల మోత భారీగా ఉంటుంది. ప్యారడైజ్ నిరాశపరిచిన నేపథ్యంలో సరైన మాస్ సినిమా కోసం బాక్సాఫిస్ మంచి ఆకలితో ఎదురు చూస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates