మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, టాలీవుడ్ నిర్మాత సుస్మిత కొణిదెలను విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమించారు. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, దసరా శరన్నవరాత్రుల వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణపై సుస్మిత తగిన సూచనలు, సలహాలు అందిస్తారు.
ఈ ప్రకారం ఆమె బోర్డు సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తున్న సుస్మిత కొణిదెలకు ఆలయ పరిపాలన రంగంలో బాధ్యతలు దక్కడం విశేషం.
ఈ క్రమంలోనే 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి దక్కిన పదవులపై చర్చ మొదలైంది. జనసేన కీలక నేత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత కేబినెట్ హోదా ఉన్న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇక, చిరంజీవికి రకరకాల పదవులు, రాజ్య సభ సభ్యత్వం, ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి వస్తాయని ప్రచారం జరిగినా…అందులో ఏదీ కార్యరూపం దాల్చలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates