ది ప్యారడైజ్.. నాన్ స్టాప్ మోడ్

చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది. ఇప్పటికే ఈ చిత్రం రెండుసార్లు డేటు మార్చుకుంది. మొదట అనుకున్న డేటేమో మార్చి 26 అయితే.. ఆ డేట్ నుంచి ఆగస్టు 21కి వాయిదా పడి.. ఆ డేటును కూడా ఖాళీ చేసి చివరికి సెప్టెంబరు 24కు ఫిక్సయిందీ చిత్రం.

కానీ ఈ డేట్‌కి కూడా సినిమా రాదంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా డేట్ మార్చుకుంటే పలు చిత్రాలకు ఇబ్బంది తలెత్తేలా ఉండడం.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో చేసుకున్న డీల్ కూడా రివైజ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో టీం వాయిదా నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని అక్టోబరు 2కే ఫిక్స్ చేయడంతో నాని మూవీకి డేట్ మార్చడానికి దాదాపు అవకాశం లేకపోయింది. ఫ్యామిలీ సినిమాలు ఈ మధ్య చాలా బాగా ఆడుతున్న నేపథ్యంలో వెంకీ-త్రివిక్రమ్ సినిమా మీదికి వెళ్లే సాహసం నాని చేయకపోవచ్చు. ఈ సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టిన దృష్ట్యా మరో చిత్రంతో పోటీ పడకుండా సోలోగానే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అనేక కారణాలతో ‘ది ప్యారడైజ్’కు డేట్ మార్చలేని సంకట స్థితి తలెత్తింది. దీంతో సెప్టెంబరు 24కే ఫిక్స్ అయి ఆ దిశగా టీం కష్టపడుతోంది.

ఐతే ఈ డేట్ అందుకోవడం మామూలు కష్టం కాదని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఏడాది దాటింది. ఇన్నాళ్లూ చాలా తాపీగా చిత్రీకరణ చేశారు. చిన్న చిన్న సీన్లకు కూడా రోజుల తరబడి టైం పెట్టారు. రీషూట్లకూ చాలా రోజులు వెచ్చించారు. కానీ ఇప్పుడేమో బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో విపరీతమైన హడావుడి నెలకొంది.

టీం రేయింబవళ్లు తీరిక లేకుండా పని చేయాల్సిన పని తలెత్తింది. డెడ్‌లైన్ అందుకునేందుకు రౌండ్ ద క్లాక్ నాన్ స్టాప్‌గా పని చేస్తున్నారు యూనిట్ సభ్యులు. ఓవైపు బ్యాలెన్స్ షూటింగ్ పనులు నడుస్తున్నాయి. ఇంకోవైపు ఎడిటింగ్, వీఎఫెక్స్, డబ్బింగ్ పనులూ తీరిక లేకుండా చేస్తున్నారు. ఏం చేసైనా.. క్వాలిటీ దెబ్బ తినకుండా సెప్టెంబరు 24న సినిమాను డెలివర్ చేయాలని కష్టపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.