మంచి సినిమా తీశాం అన్న ధీమా కావచ్చు. లేదంటే సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్ కావచ్చు. ఈ మధ్య స్టేజ్ మీద నటీనటులు, టెక్నీషియన్లు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం కామన్ అయిపోయింది. గత ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దంటూ నాని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమాకు ఆ స్టేట్మెంట్ ప్లస్ అయి హైప్ పెంచింది. సినిమా కూడా పెద్ద హిట్టవడంతో అందరూ నానిని అనుకరించడం మొదలుపెట్టారు.
కానీ ఇలాంటి స్టేట్మెంట్లు అప్పుడప్పుడూ తిరగబడుతున్నాయి కూడా. ప్రియదర్శి ‘మిత్రమండలి’ సినిమాకు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చి దెబ్బ తిన్నాడు. ఆపై ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా దర్శకుడు సాయిలు.. తన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే.. రిలీజ్ రోజు అమీర్ పేటలో కట్ డ్రాయర్ మీద తిరుగుతా అంటూ సవాల్ చేశాడు. ఆ సినిమా బాగా ఆడినప్పటికీ సాయిలు స్టేట్మెంట్ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది.
ఇక వర్తమానంలోకి వస్తే.. సహ అనే చిన్న సినిమా మీద టీం విపరీతమైన కాన్ఫిడెన్స్‌తో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా బాలేదని ఎవరైనా చెబితే అమీర్ పేట సెంటర్లో గుండు కొట్టించుకుంటా అంది. కట్ చేస్తే ఈ చిత్రానికి నెగెటివ్ టాకే వచ్చింది. చాలామంది హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో శ్వేత సహా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్లందరికీ కౌంటర్ అన్నట్లుగా యువ కథానాయకుడు శ్రీ విష్ణు తన కొత్త చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఒక మాట అన్నాడు.
ఈ చిత్ర దర్శకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా హిట్టవ్వకపోతే అమీర్ పేటలో బట్టలిప్పి తిరుగుతా లాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దు అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. తర్వాత శ్రీ విష్ణు కొనసాగిస్తూ.. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని, మనం మంచి సినిమా చేశాం కాబట్టి అది హిట్టవుతుందని శ్రీ విష్ణు అన్నాడు. శ్రీ విష్ణు పంచ్ వేయాలని అన్నాడో లేదో కానీ.. తన వ్యాఖ్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సినిమా ప్రమోషన్ కోసం ఇలా హద్దులు దాటి స్టేట్మెంట్లు ఇవ్వడం మంచిది కాదని, శ్రీ విష్ణు కౌంటర్ కరెక్టే అని అంటున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates