ఇండియా కాస్ట్లీ మూవీగా చెప్పుకుంటున్న రామాయణ విడుదల కేవలం ఇంకో రెండు నెలల్లో ఉంది. ఇంత తక్కువ సమయం ఉన్నా పబ్లిసిటీ విషయంలో టీమ్ చూపిస్తున్న అలసత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ కు నితేశ్ తివారి దర్శకత్వం వహించగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్యాన్ ఇండియా మూవీ రెండు భాగాల కోసం నాలుగు వేల కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఇంత చేసినప్పుడు సౌండ్ కూడా అడ్వాన్స్ గా ఉండాలి.
ముంబై మీడియా వర్గాల కథనాల ప్రకారం బిజినెస్ డీల్స్ విషయంలో టీమ్ ఒత్తిడిలో ఉండటం వల్లే మార్కెటింగ్ మీద ఇంకా ఫోకస్ పెట్టలేకపోతున్నారట. దాని కన్నా ముఖ్యంగా యష్ టాక్సిక్ ఫలితం వచ్చాక ప్రమోషన్లు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారట. తీరా చూస్తేనేమో దానికి నెగటివ్ రిజల్ట్ వచ్చింది. యావరేజ్ అయినా ఏదో సర్దుకోవచ్చు కానీ ఆల్ టైం డిజాస్టర్ వైపు అడుగులు వేయడం రామాయణ టీమ్ లో కొంత టెన్షన్ రేపి ఉండొచ్చు.
ఎందుకంటే ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో రన్బీర్ బ్రాండింగ్ ఎంత ప్లస్ అవుతోందో అంతే స్థాయిలో యష్ పేరు ఉపయోగపడుతుందని టీమ్ అంచనా వేస్తూ వచ్చింది. అందుకే ఎంత భారీ పారితోషికమైనా లెక్క చేయకుండా ఎస్ చెప్పారు. తీరా చూస్తే టాక్సిక్ వల్ల వచ్చిన నెగటివిటీని పోగొట్టుకోవడం యష్ కు సవాల్ అయ్యేలా ఉంది. ఎందుకంటే రాయాగా అంత నెగటివ్ క్యారెక్టర్ లో చూసిన జనాలు మళ్ళీ మరోసారి రావణ అనే విలన్ పాత్రలోనే చూడాల్సి వస్తుంది కాబట్టి.
దీని సంగతలా ఉంచితే రామాయణ బృందం ఇకనైనా ఏదో ఒక విధంగా తమ సినిమాను మీడియాలో జనంలో నానుతూ ఉండేలా చేయాలి. ఎప్పుడెప్పుడు చూద్దామనే ఎగ్జైట్ మెంట్ కలిగించేలా ఉండాలి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ప్రస్తుతానికి లేవు. అక్టోబర్ లో హడావిడిగా మొదలుపెట్టడం కన్నా ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. సీతగా సాయిపల్లవితో పాటు సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు రామాయణలో కీలక పాత్రలు పోషించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates