నమ్రత పేరు మిస్ చేసిందని నిర్మాత హర్టు

తెలుగు సినిమా చరిత్రలో నిర్మాత ఎం.ఎస్.రాజుది ఒక ప్రత్యేక ప్రస్థానం. ‘శ్రతువు’ సినిమాతో మొదలుపెట్టి.. దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నిర్మాత ఆయన. ఇప్పుడు దిల్ రాజు పేరు ఎలా అయితే ఒక బ్రాండ్ లాగా మారిందో.. ఒకప్పుడు అంతకుమించిన ఇమేజ్ తెచ్చుకున్న నిర్మాత ఆయన.

రాజు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటే ‘ఒక్కడు’నే. అంతకుముందు ఫ్లాపుల్లో ఉన్న గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్‌గా అప్పుడే ఎదుగుతున్న మహేష్ బాబును పెట్టి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మహేష్ బాబును సూపర్ స్టార్‌ను చేసింది. సరిగ్గా 18 ఏళ్ల కిందట ఈ చిత్రం సంక్రాంతికే విడుదలై భారీ విజయాన్నందుకుంది. ఈ సందర్భంగా రాజు ఈ సినిమా అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇలాంటి తరుణంలో రాజును హర్ట్ చేసే పరిణామం చోటు చేసుకుంది. ‘ఒక్కడు’ సినిమా గురించి మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టగా.. అందులో దర్శకుడు గుణశేఖర్ పేరు ప్రస్తావించి.. నిర్మాత రాజు పేరును మరిచిపోయింది. నిజానికి ‘ఒక్కడు’ లాంటి సాహసోపేత సినిమా సాధ్యమైందంటే అందుకు ఎక్కువ క్రెడిట్ నిర్మాతకే ఇవ్వాలి. ఏమాత్రం రాజీ లేకుండా ఆ సినిమాను నిర్మించారాయన. పొరబాటుగా అయినా సరే.. రాజు పేరును విస్మరించడం తప్పే. ఈ విషయంపై రాజు కొంత ఆవేదన పూర్వకంగానే ట్వీట్ పెట్టాడు.

మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి బాబూ. ఒక్కడు సినిమాకు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత గారు నా పేరు మరిచిపోయారు. ఐతే ఈ సినిమా ఆమె ఫేవరెట్ క్లాసిక్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మీకంతా మంచే జరగాలి’’ అంటూ ట్వీట్ వేశారు. ఏం పర్వాలేదు అంటూనే నమ్రత తీరుతో తాను హర్టయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు రాజు.