అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇలా ఏ టాప్ స్టార్‌ను తీసుకున్నా ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తరం హీరోలు కూడా ఏడాదికో సినిమాను రిలీజ్ చేయడం గగనంగా ఉంది.

ఐతే ఒకప్పుడు చిరు ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా ఉన్న టైంలో ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా.. ఆయన మీద అభిమానులు అలిగారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. తాను ఆశించినంత వేగంగా సినిమాలు చేయడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్న నేపథ్యంలో మెగాస్టార్.. వారిని ఉద్దేశించి ఒక సినీ పత్రికలో ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖను ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్టు ఎక్స్‌లో పంచుకున్నారు. అదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.

1989లో చిరు టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సమయంలో రాసిన లేఖ అది. అందులో మొదటి వాక్యంలో.. ‘‘ఈ సంవత్సరంలో నా సినిమాలు నాలుగో అయిదో రిలీజ్ ఉండడం ఏమిటనీ, అంత తక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటే నిస్పృహగా ఉంటోందని అనేక మంది అభిమానులు ఆందోళన వ్యక్తపరుస్తూ ఉత్తరాలు రాశారు’’ అని చిరు పేర్కొనడం గమనార్హం. ఆ టైంలో తాను చేస్తున్న సినిమాల స్కేల్ పెద్దదనీ, షూటింగ్ ఎక్కువ రోజులు పడుతోందని.. అందుకే రిలీజ్‌లు తగ్గుతున్నాయని, కాస్త అర్థం చేసుకోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేసుకున్నారు చిరు.

అంతే కాక తన పాత సినిమాల రీ రిలీజ్‌ల వల్ల తన ఇమేజ్ దెబ్బ తింటుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంపైనా చిరు స్పందించారు. దాని వల్ల మంచే తప్ప చెడు లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వర్తమానంలోకి వస్తే ప్రస్తుతం చిరు కూడా ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తే గొప్ప అన్నట్లుంది. అప్పుడప్పుడు ఆయన కెరీర్లోనూ సినిమా రిలీజ్ కాని సంవత్సరాలు ఉంటున్నాయి.

టాప్ లీగ్ హీరోల గురించైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని ఎంతమంది మొత్తుకుంటున్నా.. హీరోల తీరు పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. వారి తీరు మారట్లేదు. పాన్ ఇండియా సినిమాల మోజులో ఒక్కో చిత్రానికి రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. అప్పుడు అభిమానుల అభిప్రాయాలకు చిరు ఎంత విలువ ఇచ్చారో గమనించి.. ఇప్పటి పెద్ద హీరోలంతా ఫ్యాన్స్ అభీష్టానికి అనుగుణంగా వేగంగా సినిమాలు చేస్తూ కనీసం ఏడాదికో సినిమా అయినా రిలీజయ్యేలా చూసుకుంటే మంచిది.