మన దగ్గర పెద్ద హీరోలు ఒక్కో సినిమాను కన్ఫమ్ చేయడానికి, దాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఎంతెంత టైం తీసుకుంటున్నారో తెలిసిందే. కొందరు హీరోలు రెండు మూడేళ్లకు కానీ ఒక సినిమా చేయట్లేదు. కొందరు కష్టపడి ఏడాదికి ఒక రిలీజ్ ఉండేలా చూసుకుంటున్నారు. కానీ మలయాళంలో మాత్రం అలా కాదు. అక్కడ టాప్ స్టార్లు కూడా ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్‌లు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మాలీవుడ్‌లో నంబర్ వన్ హీరో అయిన మోహన్ లాల్ స్పీడు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
గత ఏడాది ఎల్-2: ఎంపురాన్, తుడరుమ్ చిత్రాలతో ఘనవిజయాలందుకున్న ఆయన ఈ ఏడాది ఇప్పటికే దృశ్యం-3, ప్యాట్రియాట్ చిత్రాలతో పలకరించాడు. తన కూతురు విస్మయ మూవీ తుడక్కుమ్‌లో క్యామియో చేశాడు. త్వరలో రాబోతున్న పృథ్వీరాజ్ మూవీ ఖలీఫాలోనూ ఆయన ప్రత్యేక పాత్రను పోషించాడు.
ఈ ఏడాది చివర్లో తుడరుమ్ దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వంలో నటిస్తున్న అతి మనోహరం రిలీజవుతుంది. ఓవైపు తీరిక లేకుండా నటిస్తూనే.. ఇంకోవైపు భవిష్యత్ చిత్రాల ప్లానింగ్‌లోనూ మోహన్ లాల్ పక్కాగా ఉంటాడు. కొత్తగా కమిటైన ఏడు సినిమాల వివరాలను ఆయన తాజాగా ఎక్స్‌లో పంచుకున్నారు.
తన మిత్రుడు, ఫేవరెట్ డైరెక్టర్ ప్రియదర్శన్.. దృశ్యం ఫ్రాంఛైజీ డైరెక్టర్ జీతు జోసెఫ్‌లతో పాటు తన కూతురితో తుడక్కుమ్ తీసిన జూడ్ ఆంటోనీ జోసెఫ్, తనతో హృదయపూర్వం తీసిన సీనియర్ దర్శకుడు సత్యన్ అంతికాడ్.. మహేషింటే ప్రతీకారం (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), జోజి లాంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన నటుడు దిలీష్ పోతన్.. వారణే అవష్యముండ్ ఫేమ్ అనూప్ సత్యన్.. విష్ణు మోహన్ అనే మరో యంగ్ డైరెక్టర్‌తో తాను సినిమాలు చేయనున్నట్లు మోహన్ లాల్ ప్రకటించాడు. ఇండస్ట్రీలో నంబర్‌వన్ హీరోగా ఉంటూ, 66 ఏళ్ల వయసులో ఇంత ఉత్సాహంగా, గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం మోహన్ లాల్‌కే చెల్లిందని ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates