‘విక్రమ్ వేద’ డైరెక్టర్లు… ఆగిన చిరు సినిమాలో

గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘విక్రమ్ వేద’ ఒకటి. వినూత్నమైన కథ.. అదిరిపోయే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్ది ప్రశంసలు అందుకున్నారు దర్శక ద్వయం పుష్కర్, గాయత్రి. భార్యా భర్తలైన ఈ ఇద్దరూ రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్లుగా మొదట్నుంచి ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ జోడీ.. 2017లో ‘విక్రమ్ వేద’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక, తమిళంలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.

మరోవైపు సుడల్, వదంది, వదంది-2 లాంటి వెబ్ సిరీస్‌లకు క్రియేటర్లుగా వ్యవహరించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వదంది-2’ పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా పుష్కర్, గాయత్రి ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు. ఈ ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమాకు పని చేశారట. కానీ ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది.

చిరు హీరోగా 90వ దశకం చివర్లో ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ అనే మెగా మూవీ సెట్స్ మీదికి వెళ్లిన విషయం ఆ తరం ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. ఈ సినిమాకు పుష్కర్, గాయత్రిలిద్దరూ పని చేశారట. గాయత్రి ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ కాగా.. పుష్కర్ కెమెరా విభాగంలో వర్క్ చేశాడట. ఆ సినిమా పూర్తయి ఉంటే చరిత్ర సృష్టించేదని వీళ్లిద్దరూ వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో మొదలైన సినిమా ఇదని వీరు తెలిపారు. 

ఆ రోజుల్లోనే రూ.40 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రణాళికలతో సినిమాను మొదలుపెట్టారని.. ఇంగ్లిష్ వెర్షన్‌కు ఒక హాలీవుడ్ డైరెక్టర్, ఇండియన్ వెర్షన్లకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారని.. నెల రోజులకు పైగా షూటింగ్ కూడా జరిగిందని పుష్కర్, గాయత్రి చెప్పారు. అప్పటికి ఎవ్వరూ వాడని టెక్నాలజీతో.. దేశవిదేశాల్లో అరుదైన లొకేషన్లలో భారీగా కొన్ని సన్నివేశాలను తీశామని.. ఈ చిత్రానికి చాలామంది హాలీవుడ్ నిపుణులు పని చేశారని.. ఐతే బడ్జెట్ సహా కొన్ని కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందని పుష్కర్, గాయత్రి గుర్తు చేసుకున్నారు.