‘క్రాక్’ సినిమాకు ఇది మామూలు షాక్ కాదు. శనివారం ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడటం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతకు రావాల్సిన ఆదాయంలో భారీ కోత తప్పేలా లేదు. ముందు సంక్రాంతి పండక్కి అనుకున్న ఈ చిత్రాన్ని.. ఆరు రోజులు ముందుకు జరిపి జనవరి 9న విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పండక్కి మూడు సినిమాలతో పోటీ పడటం కన్నా.. ముందు వారంలోనే వచ్చేస్తే సోలోగా ఐదు రోజులు బాక్సాఫీస్‌ను దున్నుకోవచ్చని చిత్ర బృందం ప్లాన్ చేసుకుంది. అది బాగానే వర్కవుటయ్యేలా కనిపించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న థియేటర్లన్నింటిలోనూ ఈ సినిమానే నింపేశారు. కొవిడ్ విరామం తర్వాత తెరుచుకున్న ప్రతి సింగిల్ స్క్రీన్‌లోనూ ఈ సినిమాను వేసుకున్నారు. ఇంకా పున:ప్రారంభం కాకుండా ఉన్న థియేటర్లను కూడా ఈ సినిమాతోనే మళ్లీ మొదలుపెట్టడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి పెద్ద ఎత్తునే స్క్రీన్లు, షోలు ఇచ్చారు.
అనుకున్న ప్రకారం శనివారం ఉదయం సినిమా రిలీజై ఉంటే తొలి రోజు బంపర్ ఓపెనింగ్స్ వచ్చేవి. రెండో రోజు ఆదివారం కూడా వసూళ్లకు ఢోకా ఉండదు. సినిమాకు టాక్ ఎలా ఉన్నప్పటికీ సోమ, మంగళవారాల్లో వసూళ్లు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో ‘క్రాక్’కు తొలి రెండు రోజుల వసూళ్లే కీలకం. ఐతే అందులో ఇప్పుడు సగం దాకా కోత పడిపోయింది. సాయంత్రానికి సమస్య పరిష్కారం అయినట్లు.. ఫస్ట్ షోలు లేదా సెకండ్ షోలతో బొమ్మ పడబోతున్నట్లు వార్తలొస్తున్నాయి కానీ.. అదెంత వరకు నిజమో చూడాలి. అలా షోలు పడ్డప్పటికీ జరిగిన నష్టం మాత్రం పెద్దదే.
ఈ అనిశ్చితిలో తొలి రోజు మొత్తంలో వచ్చే ఆదాయం కనీస మొత్తంలోనే ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల ఆదాయంలో కోత పడ్డ మాట వాస్తవం. రవితేజ గత సినిమాల ప్రభావంతో సంబంధం లేకుండా ‘క్రాక్’కు మంచి క్రేజ్ వచ్చినా, అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగినా.. ఉదయం థియేటర్ల దగ్గర భారీగా జన సందోహం కనిపించినా.. ఇవన్నీ కూడా నిర్మాతకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వృథా అయ్యాయి. ‘క్రాక్’ గోల్డెన్ ఛాన్స్ మిస్సయిపోయింది.