సినిమాల్లో, మీడియా ముందు చాలా హుషారుగా కనిపించే వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోనూ ఎన్నో బాధలు, విషాదాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనూ ఆ విషయాలు బయటికి వస్తుంటాయి. మెయిల్, మ్యాడ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ జీవితంలోనూ పెద్ద విషాదం ఉంది. ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడి కొన్నేళ్ల ముందు చనిపోయింది.
తనకు అన్నీ తానై చూసుకునే తల్లికి క్యాన్సర్ రావడం.. కొన్ని నెలల్లోనే చనిపోవడంతో తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానని.. బరువు కూడా తగ్గిపోయానని ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది గౌరీప్రియ. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ రూపంలో తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్నందుకోవడం, తన నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తుండడంతో ఈ సినిమా సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయిపోయింది గౌరీప్రియ.
జీవితంలో పెద్ద విజయం సాధించినపుడు.. కుటుంబ సభ్యులను తలుచుకోవడం ఎవ్వరైనా చేసేదే. శ్రీ గౌరీప్రియకు కూడా తన తల్లిదండ్రులే గుర్తుకు వచ్చారు. కానీ తనకు ఈ స్థాయిలో ప్రశంసలు వస్తున్నపుడు తోడుగా తల్లి లేకపోవడం గురించి తలుచుకుని ఆమె స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది. ఐతే ఇప్పుడు తన తల్లి ఉంటే బాగుండేదని అంటూనే.. ఆమె ఇక్కడ లేదని తాను అనుకోవడం లేదని ఆమె అంది. తల్లి పైనుంచి అంతా చూస్తూనే ఉంటుందని.. ఇక్కడే ఎక్కడో కూర్చుని ఉంటుందని ఆమె చెప్పడంతో అందరూ కదిలిపోయారు.
ఈ వేడుకకు శ్రీ గౌరీప్రియ తండ్రి కూడా హాజరు కాగా.. ఆయనకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. కుటుంబం లేకుండా తాను ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదని.. ఈ క్రెడిట్ అంతా వాళ్లదే అని ఆమె అంది. దీంతో శ్రీగౌరీప్రియ తండ్రి కూడా భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా ఈ వేడుకలో పాల్గొన్న వాళ్లనే కాక.. తన స్పీచ్ చూసిన వాళ్లందరినీ ఎమోషనల్ చేసేసింది శ్రీగౌరీప్రియ. చెన్నై లవ్ స్టోరీలో నివేదిత పాత్రలో అద్భుత నటనతో ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించిన గౌరీప్రియ.. బయట ఈ స్పీచ్‌తోనూ కన్నీళ్లు పెట్టించేయడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
