మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు థియేటర్లకు వస్తేనే జనాలను కంట్రోల్ చేయడం కష్టమైపోతోంది. కొందరు చిన్న హీరోలు మాత్రమే థియేటర్ల విజిట్‌కు వస్తున్నారు. అలాంటిది పెద్ద స్టార్లు తమ సిటీల్లో థియేటర్లకు వచ్చారంటే అంతే సంగతులు.

ఏడాదిన్నర కిందట ‘పుష్ప-2’ షో చూసేందుకు అల్లు అర్జున్ రావడంతో తలెత్తిన విషాదం చూశాక.. అలాంటి ప్రయత్నాలు అందరూ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. తమ సినిమాలకు కాకుండా వేరే వాళ్ల చిత్రాలు చూడ్డానికి స్టార్లు సైలెంటుగా వచ్చి వెళ్లడంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. ఎవరైనా గుర్తుపడితే బాగా హడావుడి అయిపోతుంది.

అందుకే పెద్ద హీరోల్లో దాదాపుగా అందరూ తమ నగరాల్లో థియేటర్లకు వచ్చి సినిమా చూడడాన్ని అవాయిడ్ చేస్తుంటారు. ఇంట్లో హోం థియేటర్లో సినిమా చూడడం.. లేదంటే వేరే సిటీల్లో మాస్కులు పెట్టుకుని సినిమాలకు వెళ్లడం, లేదంటే విదేశాల్లో థియేటర్లకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు.
ఐతే తమిళంలో నంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్..

హైదరాబాద్‌లో తెలుగు, తమిళ సినిమాలు చూస్తాడంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరగ్గా, అందులో ఎంత వరకు వాస్తవం ఉందో అని చాలామంది సందేహించారు. కానీ అది జస్ట్ రూమర్ కాదని, విజయ్‌కి నిజంగానే ఇక్కడ సినిమాలు చూసే అలవాటు ఉందని వెల్లడైంది. తమిళంలో టాప్ లిరిసిస్టుల్లో ఒకరైన వివేక్.. దళపతి తనతో కలిసి హైదరాబాద్‌లో సినిమా చూసిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తాను, విజయ్ నాలుగేళ్ల ముందు ఒక సినిమాకు పని చేస్తూ హైదరాబాద్‌లో ఉన్నామని.. ఆ టైంలో తాను ఒక రోజు రాత్రి మహేష్ బాబు మల్టీప్లెక్స్‌కు వెళ్లి ధనుష్ సినిమా ‘తిరుచిత్రాంబళం’ చూశానని.. ఆ విషయాన్ని మరుసటి రోజు విజయ్‌తో పంచుకోగా, తనకు కూడా టికెట్ బుక్ చేయమని చెప్పినట్లు వివేక్ తెలిపాడు.

ఐతే తాను చూసింది తమిళ వెర్షనే కావడంతో అక్కడికి వచ్చిన కొందరు తమిళ జనాలు లిరిసిస్ట్ అయినప్పటికీ తనను గుర్తుపట్టి ఫొటోలు దిగారని, అలాంటిది విజయ్‌ని గుర్తుపడితే ఏంటి పరిస్థితి అని తాను భయపడ్డానని.. కానీ విజయ్ మాత్రం పట్టుబట్టి టికెట్లు బుక్ చేయించి తనతో పాటు ఏఎంబీకి వచ్చి ఆ సినిమా చూసినట్లు తెలిపాడు వివేక్.