డి డే.. 2021 ఎలా మొదలవుతుందో?


2020లో తెలుగు సినిమాలకు మామూలు ఆరంభం దక్కలేదు. ఓవైపు అల వైకుంఠపురములో, మరోవైపు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతికి వసూళ్ల మోత మోగించి కొత్త ఏడాదికి అదిరే ఆరంభాన్ని అందించాయి. దీంతో 2020 మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. కానీ కరోనా వచ్చి ఆ ఏడాది ప్రణాళికలన్నింటినీ ఛిద్రం చేసేసింది. సినీ రంగంపై వైరస్ చూపించిన ప్రభావం అలాంటిలాంటిది కాదు. వేసవి నుంచి అన్ని సీజన్లూ వెలవెలబోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడెనిమిది నెలల పాటు థియేటర్లు మూతపడి ఉన్నాయి.

ఏడాది చివర్లో థియేటర్లు పున:ప్రారంభం కాగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మినహా పేరున్న సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. దానిక మంచి స్పందనే రావడంతో కొత్త ఏడాదిపై ఆశలు రేకెత్తాయి. ఇప్పటికీ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నప్పటికీ సంక్రాంతికి నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.

అందులో మొదటి చిత్రం ‘క్రాక్’ సంక్రాంతి పండక్కి ఐదు రోజుల ముందే.. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొత్త ఏడాదికి ఈ సినిమా ఎలాంటి ఆరంభాన్నిస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. డాన్ శీను, బలుపు లాంటి హిట్ల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేనిల నుంచి వస్తున్న చిత్రమిది. రవితేజ నుంచి చివరగా వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్లే. గోపీచంద్ కెరీర్ కూడా ఏమంత బాగా లేదు. చివరగా అతను తీసిన ‘విన్నర్’ డిజాస్టర్ అయింది. ఆపై మూడేళ్ల విరామం తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా ఇది. కానీ హీరో, దర్శకుడి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ‘క్రాక్’కు విడుదల ముంగిట మంచి హైపే వచ్చింది. సోలో రిలీజ్ కావడంతో ఈ చిత్రానికి పెద్ద సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. బుకింగ్స్ పర్వాలేదు.

ఐతే సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నదే కీలకం. ఐదు రోజుల పాటు ఆ సినిమాను మెజారిటీ థియేటర్లలో ఆడించబోతున్నారు. టాక్ బాగుంటే మంచి వసూళ్లే రాబట్టే అవకాశముంది. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో రప్పించదగ్గ క్యాలిబర్ ఉన్న సినిమానే ఇది. కాకపోతే పాజిటివ్ టాక్ అనేది కీలకం. మరి శనివారం మార్నింగ్ షో తర్వాత ఈ చిత్రం గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారో.. రివ్యూలెలా వస్తాయో చూడాలి.