బేబీ దారిలోనే చెన్నై లవ్ స్టోరీ

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద హీరో కిరణ్ అబ్బవరంతో పాటు టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పాటల విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోయాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ కథకుడు కం నిర్మాతైన సాయి రాజేష్ పేరు మీదే ఎక్కువ మార్కెటింగ్ జరిగింది. దీని వెనుక ఉద్దేశం బేబీ బ్రాండ్ ఉపయోగించి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళడం. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ ప్రేమకథ నిడివి గురించి ఒక కీలకమైన లీక్ వచ్చింది.

తొలుత 3 గంటల 10 నిమిషాల నిడివి లాక్ చేసి తర్వాత ఒక పది నిముషాలు తగ్గించారని తెలిసింది. ఒక ప్రేమకథకు ఇది చాలా పెద్ద నిడివి. గతంలో బేబీ మూడు గంటల లెన్త్ తో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే నమ్మకంతో దీనికి కూడా అంతే సమయం ఫిక్స్ చేశారేమో కానీ టీమ్ కోణంలో చూసుకుంటే కొంచెం రిస్కని చెప్పాలి. కంటెంట్ బాగుంటే జనం సమయాన్ని లెక్క చేయరని దురంధర్ నిరూపించింది. అయితే అది మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి ఆడియన్స్ లెక్కలు వేసుకోలేదు.

మరి చెన్నై లవ్ స్టోరీలో కనక ఆ స్థాయి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఎమోషన్స్, కల్ట్ అని పదే పదే చెప్పుకుంటున్న టీమ్ ఆ ఒక్క మాటతోనే అంచనాలు పెంచే ప్రయత్నంలో ఉంది. రిలీజయ్యాక జనాలు ఆ మాట ఆంటే బాగుంటుంది కానీ మేకర్స్ ముందుగానే ఆ ట్యాగ్ వేసుకోవడం గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఇవన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి అది వేరే విషయం.

ఒక రోజు ముందు జన నాయకుడు రిలీజ్ ఉన్నప్పటికీ చెన్నై లవ్ స్టోరీ టీమ్ టెన్షన్ పడటం లేదు. ఎలాగూ భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి దాని వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎఫెక్ట్ అవుతుందని భావించడం లేదు. శ్రీ గౌరీప్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా చెప్పుకుంటున్నారు. ట్రైలర్ కట్ జనంలోకి బాగానే వెళ్ళింది కానీ బేబీ స్థాయి హైప్ కి ఇది చేరుకుంటుందా లేదానేది ఇంకా వేచి చూడాలి.