రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు వసూలు చేసిందంటే అది అబద్దమే అనే తరహాలో ఇద్దరూ ఒకే స్టేట్ మెంట్ చెప్పుకోవడం లేనిపోని అనుమానాలకు దారి తీసింది. అది పరోక్షంగా పెద్ది గురించేనని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంధుకంటే ఈ మధ్య కాలంలోనే కాదు 2026లో అంత మొత్తం వసూలైనట్టు చూపించిన ఒకే మూవీ పెద్ది. సరే వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఈ ఇష్యూలోని మరో కోణాన్ని చూడాలి.
ఇప్పుడే కాదు గత పదేళ్లలో లెక్కలేనన్ని సినిమాలు తప్పుడు నెంబర్లతో ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడానికి రాంగ్ పోస్టర్లు వేయడం పరిపాటిగా మారింది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతే దీన్ని పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. గతంలో నాగవంశీ సైతం ఇదే టాపిక్ ప్రస్తావిస్తూ పోస్టర్ మీద నెంబర్లు, బుక్ మై షో రేటింగులు ఇవన్నీ బిజినెస్ లో భాగమని, నిజమని చెప్పడానికి గ్యారెంటీ లేదని కుండ బద్దలు కొట్టేశారు. అంటే వాస్తవంగా వచ్చిన అంకెలకు నిజాలకు తేడా ఉంటుందన్న మాట.
ఇలా జరగకపోవడం వెనుక కారణం లేకపోలేదు. కరోనా వెళ్ళిపోయి గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్న ఓటిటిలు పెద్ద సినిమాల విషయంలో కొత్త కండీషన్లు పెడుతున్నాయి. ముందు ఒక ఫిక్స్డ్ అమౌంట్ చెప్పేసి అంతకన్నా ఎక్కువ కావాలంటే సినిమా వసూలు చేసే ప్రతి వంద కోట్లకు ఇంత ఇస్తామంటూ పర్సెంటేజ్ ప్రకారం అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. దీని వల్ల నిర్మాతకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు నెంబర్లు పెంచాల్సి వస్తోందని వినికిడి.
పెద్ది విషయంలో ఇలా జరిగిందా లేదా అనేది ఎవరికి తెలియదు. కానీ పరిశ్రమలో ఇలాంటి ధోరణి మాత్రం సంవత్సరాల తరబడి ఉంది. ఇది ఇకపై ఆగేది కాదు మారేది కాదు. మనకే కాదు హిందీ తమిళ మలయాళ అన్ని భాషల్లో ఈ తరహా పోకడలు ఉన్నాయి. వాటితో పాటు సర్దుకుని పోవాల్సిందే తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. రాబోయే ఆరేడు నెలల్లో చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టాయి. ఎవరెవరు ఎంతెంత నెంబర్లు వేసుకుంటారో ఊహించడం, వాస్తవాలు నిర్ధారించడం కష్టమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
