100 పర్సంట్ ఆక్యుపెన్సీ.. రాజకీయ దుమారం


లాక్ డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా పున:ప్రారంభం అయిన థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. ఐతే తమిళనాట మాత్రం తాజాగా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడుపుకునేందుకు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో నిర్ణయం కేంద్రానిదే అనుకున్నారు కానీ.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం సొంతంగా నిర్ణయం తీసుకుని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఐతే ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ హర్షం ప్రకటిస్తున్నప్పటికీ.. అక్కడి ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నాయి. తమిళనాట కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతుండగా.. వంద శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చి ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాన్ని రిలీజ్ చేస్తే థియేటర్ల దగ్గర జనం భారీగా గుమిగూడి వైరస్ ప్రభావం పెరుగుతుందని.. వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది తమిళనాట మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం తొందరపాటే అని డీఎంకే సహా ప్రతి పక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

ఐతే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి వేరే కారణాలు కూడా ఉన్నట్లు అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మాస్టర్’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్న నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వాలని ఇటీవల హీరో విజయ్ స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాడు. అక్కడ హామీ తీసుకున్నాకే ‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఖరారు చేశారు. కొన్ని రోజులకే 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చేశాయి. దీంతో విజయ్ అభిమానుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల అభిప్రాయం నెలకొందని.. మరి కొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇది కలిసొస్తుందని భావిస్తున్నారు.

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సినీ పరిశ్రమ బాగు కోసం కాకుండా రాజకీయ లబ్ది కోసమే తీసుకుందని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. విజయ్ అభిమానులకు అధికార పార్టీకి సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందో అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా ప్రభావం కొనసాగుతుండగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఎలా అవకాశమిస్తారంటూ విమర్శలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.