మహేష్ నమ్మకమే బహదూర్ బలం

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రావు బహదూర్ ప్రమోషన్లు ఆఖరి స్టేజికి వచ్చేశాయి. ప్రేక్షకుల తీర్పు అందుకునే సమయం ఆసన్నం కావడంతో టీమ్ చివరి ఆయుధాలను వాడేస్తోంది. పబ్లిసిటీ కంటెంట్ లో వెరైటీ స్ట్రాటజిలు పాటిస్తోంది. ఆ మధ్య మూడు నిమిషాల టీజర్ రిలీజ్ చేసి ఇప్పుడు ట్రైలర్ ని నిమిషంన్నరకు పరిమితం చేయడం కొత్తగా ఉంది. ఇవాళ దీని లాంచ్ జరిగింది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో కథేంటో చెప్పలేదు కానీ కథనంలోని గొప్పదనం వివరించారు.

ఈ మూవీకి మహేష్ నిర్మాతగా వ్యవహరించాడని కాదు కానీ తన మాటలు వింటే చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. తెలుగు సినిమా ఇప్పటిదాకా చూడనిది అనే తరహాలో ఎలివేషన్లు ఇవ్వడం చూస్తే బొమ్మ ఆషామాషీగా లేదని అనిపిస్తోంది. సత్యదేవ్ ఈ మూవీలో చాలా షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా వయసు మళ్ళిన రావు బహదూర్ వేషం అన్నింటి కన్నా ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంది. దీంతో పాటు బంగ్లా సెటప్, హీరోయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి.

ఓపెనింగ్స్ పరంగా రావు బహదూర్ ఏదో అద్భుతాలు చేస్తుందని కాదు కానీ టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ప్రేక్షకులు ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారు. సోలో హీరోగా జనాన్ని మొదటి రోజే ఫుల్ చేసే బలం సత్యదేవ్ కి ఇంకా రాలేదు. చాలా బాగుందనే మాట వినిపిస్తేనే జనం టికెట్లు కొంటున్నారు. ఓటిటిలో తన సినిమాలకు దక్కే విపరీతమైన ఆదరణ, పెర్ఫార్మన్స్ అందుకునే ప్రశంసలు, ఇవన్నీ కమర్షియల్ వసూళ్లుగా మార్చాల్సిన బాధ్యత రావు బహదూర్ మీద ఉంది.

ఇక పోటీపరంగా చూసుకుంటే రావు బహదూర్ కు నాగబంధం రూపంలో కాంపిటీషన్ ఉంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డ ఈ ఫాంటసీ డ్రామాలో విరాట్ కర్ణ హీరోగా నటించాడు. దర్శకుడు అభిషేక్ నామా కథ మీద నమ్మకంతో నిర్మాతలు వంద కోట్ల బడ్జెట్ పెట్టేశారు. రావు బహదూర్ డైరెక్టర్ వెంకటేష్ మహా మీద కూడా అంతే కాన్ఫిడెన్స్ తో గట్టిగానే ఖర్చు పెట్టారు. బలమైన పునాది కోసం పోరాడుతున్న సత్యదేవ్ కు రావు బహదూర్ బ్రేక్ ఇస్తే సినీ ప్రియులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.