దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల గురించి చర్చ జరుగుతుంటుంది. కొందరు స్థాయి లేకున్నా అవార్డులకు ఎంపికవుతుంటారు. కొందరేమో పొందే పురస్కారం కంటే ఎక్కువ అర్హతలున్నట్లుగా కనిపిస్తారు. పద్మ పురస్కారాల్లో అన్నింటికంటే తక్కువ స్థాయి అయిన పద్మశ్రీ వచ్చినపుడు.. అది తమ స్థాయికి తక్కువ అని ఫీలైన ప్రముఖులు చాలామందే ఉన్నారు.
ఈ సమస్య రాకూడదని పద్మ పురస్కారాలు ప్రకటించే ముందు అవార్డులకు ఎంపికైన వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటోందట కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ఈ ఏడాది పద్మశ్రీకి ఎంపికైన సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ వెల్లడించారు. ఆయనకు పురస్కారం ప్రకటించే ముందు ఈ అవార్డు అందుకోవడం మీకు అంగీకారమేనా అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అభిప్రాయం అడిగినట్లు ఆయన ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తనకు పద్మశ్రీ పురస్కారం దక్కాలని ఎప్పుడో ఆశించానని.. కానీ అందుకు గ్యారెంటీ లేదని తనకు తెలుసని ఆయనన్నారు. చాలామంది మీకు ఎప్పుడో ఈ అవార్డు రావాల్సిందని అన్నారని.. కానీ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరున్నా ఢిల్లీలో ఉన్న వారికి మన గురించి ఎలా తెలుస్తుందని ఆయనన్నారు.
ఇక తనకు ఈ ఏడాది పద్మశ్రీ ప్రకటించే ముందు తనకు హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన కాల్ గురించి ఆయన వెల్లడించారు. ముందుగా తన గురించి వివరాలు అడిగి, తర్వాత మీకు పద్మశ్రీ అందుకోవడం అంగీకారమేనా అని అడిగారని.. తాను అంగీకారమే అని చెప్పానని ఆయనన్నారు. ఇలా ఎందుకు అడుగుతున్నారు అంటే.. కొందరు తమ స్థాయికి ఇది చిన్నది అని భావించి, ఇంకా పెద్ద పురస్కారం ఇవ్వాల్సిందన్న అసంతృప్తితో పద్మశ్రీని నిరాకరిస్తుంటారని, అందుకే అభిప్రాయం తెలుసుకుంటున్నామని చెప్పారని మురళీ మోహన్ తెలిపారు.
తనకీ విషయం చెప్పాక, అధికారికంగా ప్రకటించేవరకు ఎవ్వరికీ విషయం చెప్పొద్దన్నారని.. కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలియకూడదన్నారని.. ఆ ప్రకారమే తాను తన ఎగ్జైట్మెంట్‌ను ఆ రోజు సాయంత్రం వరకు ఆపుకున్నానని మురళీ మోహన్ వెల్లడించారు. ఒకవేళ ఇది ఫేక్ కాల్ కూడా అయ్యుండొచ్చని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెయిట్ చేశానని. కానీ సాయంత్రం సారథీ స్టూడియోస్ నుంచి ఒకరు ఫోన్ చేసి తనకు కంగ్రాట్స్ చెప్పారని, అప్పుడు టీవీ చూస్తే తనకు నిజంగానే పద్మశ్రీ వచ్చిందని తెలిసిందని మురళీ మోహన్ తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates