కిచిడీ కామెడీకి వంద కోట్ల వసూళ్లు

దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఆ ఆశ అంత త్వరగా నెరవేరేలా లేదు. సినిమాలైతే కంటిన్యూగా వస్తున్నాయి కానీ అవేవి అయిదు వందల కోట్ల స్థాయిలో లేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశపరుస్తోంది. ఉన్నంతలో ‘మై వాపస్ ఆవూగా’ లాంటివి నెట్టుకొస్తున్నాయి కానీ జరిగిన బిజినెస్ తక్కువ కావడం వల్ల లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. ‘కాక్ టైల్ 2’ ఆశించిన ఫలితం అందుకోవడం అనుమానమే.

ఇక మొన్న శుక్రవారం ‘వెల్కమ్ టు ది జంగల్’ని పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ముందు రోజే ప్రీమియర్లు కూడా వేశారు. అయితే నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. కామెడీ పేరుతో కిచిడి చేశారని, చిత్ర విచిత్రమైన పాత్రలతో ఖంగాళీ పెట్టారని క్రిటిక్స్ తలంటారు. ట్విస్ట్ ఏంటంటే ఊహించని విధంగా ఈ మూవీ వారం తిరక్కుండానే వంద కోట్ల వైపు పరుగులు పెట్టడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. కంటెంట్ తేడాగా ఉన్నా ఏదోలా నవ్వుకోవడానికి ఆడియన్స్ ప్రాధాన్యం ఇస్తున్నారేమో.

కథ మొత్తం ఒక అడవిలోనే జరుగుతుంది. హవాలా డబ్బుతో ఫ్లాప్ సినిమా తీసి వైట్ మనీగా మార్చుకుందామని చూసే ఒక డాన్, పేరుకి ఆర్మీ ఆఫీసర్ అయినా లోపల కామెడీ క్యారెక్టర్ అనిపించే హీరో, హీరోయిన్ కిడ్నాప్, నకిలీ పెళ్లి, ఒకళ్ళు ఇంకొకల్లా మారిపోవడం ఇలా ఊహకందని విన్యాసాలు ఇందులో చాలానే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ జంతువుల ఎపిసోడ్స్ బోనస్. అరిగిపోయిన స్టోరీ లైన్ మళ్ళీ చెప్పాలని ప్రయత్నించిన దర్శకుడు అహ్మద్ ఖాన్ కొత్తదనం లేకుండా జాగ్రత్త పడ్డారు.

క్యాస్టింగ్ చూస్తే రెమ్యునరేషన్లకే సగం బడ్జెట్ అయిపోయి ఉంటుంది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, జాకీ శ్రోఫ్, దిశా పటాని, రవీనాటాండన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, లారా దత్తా, పరేష్ రావల్, తుషార్ కపూర్, అర్షద్ వార్సీ, రాజ్ పాల్ యాదవ్, జానీ లివర్ ఇలా రాసుకుంటూ పోతే పేజీలు నిండిపోయే తారాగణం పెట్టేశారు. దీంతో ఎవరికీ సరైన స్క్రీన్ స్పేస్ దక్కకుండా గందరగోళం అయిపోయింది. అతిగా మసాలా దట్టించిన బిర్యానీ కావాలంటే తప్ప ఈ జంగల్ ని తట్టుకోవడం కష్టం.