బ‌న్నీ-సుక్కు.. ఇక నాన్ స్టాప్‌


అనివార్య కార‌ణాల‌తో చాలా ఆల‌స్యంగా ప‌ట్టాలెక్కింది సుకుమార్, అల్లు అర్జున్‌ల‌ పుష్ప సినిమా. షూటింగ్ మొద‌ల‌య్యాక కూడా ఆ చిత్రానికి అడ్డంకులు త‌ప్ప‌లేదు. ప‌క్కాగా ప్లాన్ చేసుకుని తూర్పు గోదావ‌రి జిల్లాలోని మారేడుమిల్లి అడ‌వుల్లో షూటింగ్ మొద‌లుపెడితే.. కొన్ని రోజుల వ‌ర‌కు అంతా బాగానే సాగింది. కానీ అంత‌లోనే క‌రోనా కాటుతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది.

దీంతో సుకుమార్ తీవ్ర నిరాశ‌కే గురైన‌ట్లు యూనిట్ వ‌ర్గాల స‌మాచారం. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌కు తిరిగొచ్చేసిన చిత్ర బృందం.. కొన్ని రోజుల విరామం త‌ర్వాత ఈ సిటీలోనే వేరే స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టింది. రెండు వారాల పాటు షూటింగ్ సాగింది. కాచిగూడ‌, ప‌టాన్‌చెరు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. త‌ర్వాత విరామం తీసుకున్నారు.

ఇక పుష్ప టీం కొన్ని రోజుల్లోనే సుదీర్ఘ షెడ్యూల్ మొద‌లుపెట్ట‌బోతోంది. మ‌ళ్లీ టీం అంతా క‌లిసి మారేడుమిల్లికే వెళ్ల‌బోతున్నారు. జ‌న‌వ‌రి 7న ఈ షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. ఆరేడు వారాల పాటు విరామం లేకుండా అడ‌వి నేప‌థ్యంలో అనుకున్న స‌న్నివేశాలు, యాక్ష‌న్ ఎపిసోడ్లు, పాట‌లు అన్నీ పూర్తి చేయ‌బోతున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌తో స‌గానికి పైగానే సినిమా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. మ‌ళ్లీ అడ‌విలోకి వెళ్లే అవ‌స‌రం లేకుండా మొత్తం ప‌ని ముగించేయాల‌ని సుక్కు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

ఈసారి క‌రోనా బెడ‌ద లేకుండా అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్య‌, సాధ్య‌మైనంత త‌క్కువ‌మంది క్రూతో షూటింగ్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ షెడ్యూల్ మ‌ధ్య‌లోనే విల‌న్ రంగ‌ప్ర‌వేశం చేస్తాడ‌ట. త్వ‌ర‌లోనే ఆ పాత్ర‌ను చేసేదెవ‌రో వెల్ల‌డించ‌నున్న‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌.