దండోరా దర్శకుడికి నాని ఛాన్స్

కొన్ని సినిమాలు కొన్ని కారణాల వల్ల థియేటర్లలో అనుకున్నంతగా ఆడవు. కానీ అవి మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకుంటాయి. ముఖ్యంగా ఓటీటీలో రిలీజైనపుడు వాటికి మంచి అప్లాజ్ వస్తుంది. థియేటర్లలో ఆ సినిమాలు చూడనందుకు ప్రేక్షకులు ఫీలవుతారు. ఇలా గత ఏడాది మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘దండోరా’ ఒకటి. శివాజీ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంతో మురళీకాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

కుల వ్యవస్థ నేపథ్యంలో ఆలోచన రేకెత్తించేలా ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రశంసలు అందుకున్నాడు మురళీకాంత్. తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. మంచి పేరు రావడంతో ఇప్పుడో పెద్ద ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకుడిగా తన రెండో సినిమాను చేయబోతున్నాడట.

నానికి వాల్ పోస్టర్ సినిమా పేరుతో సొంత బేనర్ ఉన్న సంగతి తెలిసిందే. ‘అ!’తో మొదలుపెట్టి.. హిట్ ఫ్రాంఛైజీ సినిమాలు, కోర్ట్ మూవీతో నాని నిర్మాతగా మంచి గుర్తింపే సంపాదించాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికే ఈ బేనర్ పెట్టి మంచి సక్సెస్ రేట్‌తో సాగిపోతున్నాడు నాని. ఆయన తన ప్రొడక్షన్లో తీయబోయే కొత్త సినిమాకు మురళీ కాంత్‌ను ఎంచుకున్నాడట. తన కథ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

కన్నడ భామ రుక్మిణి వసంత్‌ను కథానాయిక పాత్రకు ఓకే చేసినట్లు సమాచారం. ఇంకా హీరో సంగతే తేలలేదు. రుక్మిణికి జోడీగా అంటే పేరున్న నటుడే లీడ్ రోల్ చేసే అవకాశముంది. నాని.. శైలేష్ కొలను, కార్తి కాంబినేషన్లో హిట్-4 మూవీని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఆలోపే మురళీకాంత్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు.