పెద్ది విడుదలైన వారం రోజులకే ఇంకో సినిమా రిలీజ్ చేసే సాహసం వేరే నిర్మాతలు చేయలేదు కానీ కంటెంట్ మీద నమ్మకంతో వైజయంతి మూవీస్ సంస్థ సింగ్ గీతంని జూన్ 11 విడుదలకు రెడీ చేసేసింది. ఆల్రెడీ ప్రమోషన్లు మొదలైపోయాయి. కొత్తజంట పరిచయమవుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్, ప్రమోషన్ బాధ్యతలను నాగ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ చూసుకుంటున్నారు. ఇది కాదు కానీ అసలు విషయం వేరే ఉంది.
విశ్రాంతి తీసుకోవడం కూడా కష్టంగా భావించే 94 ఏళ్ళ వయసులో సింగీతం శ్రీనివాసరావుగారు ఈ సింగ్ గీతంకు దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం మరో ప్రధాన ఆకర్షణ. క్యాస్టింగ్ ఎవరున్నారు అనేది పక్కన పెడితే పెద్దాయన కోసమైనా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్న మూవీ లవర్స్ ఎందరో ఉన్నారు. ఒకప్పుడు భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు, బృందావనం, ఆదిత్య 369 లాంటి కల్ట్ మూవీస్ ఇచ్చిన దర్శకుడిగా ఆయన మీద ప్రేమ అలాంటిది.
ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఉంది. టాలీవుడ్ లో ఒకప్పుడు గొప్పగా వెలిగిన కొందరు అగ్ర దర్శకులు యాభై వయసు రాగానే తాము ఈ జనరేషన్ కు తగ్గట్టు ఆలోచించలేకపోతున్నామని చెప్పి చాలా త్వరగా రిటైర్ మెంట్ తీసుకుని వేరే వ్యాపారాలు చూసుకుంటున్నారు. లిస్టు రాసుకుంటూ పోతే కనీసం యాభై మంది టాప్ డైరెక్టర్లు తేలుతారు. వీళ్లంతా సింగీతం కన్నా కనీసం ముప్పై నలభై సంవత్సరాలు చిన్నవారు.
ఏజ్ ని లెక్కచేయకుండా ఇంత తపనతో కష్టపడిన సింగీతం శ్రీనివాసరావుగారు ఆరోగ్య రిత్యా ప్రతి చోటికి రాలేకపోయినా సింగ్ గీతంలో క్వాలిటీ చూస్తుంటే టాక్ తో జనాన్ని మెల్లగా అయినా రప్పించేలా ఉన్నారు. పెద్ది దూకుడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాంతో సంబంధం లేకుండా సింగ్ గీతం ఆదరణ పొందితే ఎందరికో స్ఫూర్తి దక్కుతుంది. త్వరలో ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తారని సమాచారం. ఆయన తీసిన సినిమాల హీరోలందరూ అందులో పాల్గొంటే ఎంత బాగుంటుందో కదా.
Gulte Telugu Telugu Political and Movie News Updates
