ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు చూడతరమా లాంటి సినిమాలను మూవీ లవర్స్ అంత సులభంగా మర్చిపోలేరు. డెబ్యూ మూవీ లాఠీకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇంత టాలెంట్ ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఈ మధ్య తన స్థాయికి తగ్గ కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు. యుఫొరియాకి కాసింత హంగామా చేశారు కానీ థియేటర్లలో పనవ్వలేదు. ఓటిటిలో మరీ సూపర్ అనిపించే రెస్పాన్స్ రాలేదు.

ఇదిలా ఉండగా తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుణశేఖర్ ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ చర్చకు దారి తీస్తోంది. ఒక్కడు స్టార్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకోలేదని, అలా అయితే మహేష్ బాబుకి ఇంకో సైనికుడు అయ్యేదని బాంబు పేల్చారు. ఫలానా హీరోని దృష్టిలో పెట్టుకుని ఒక్కడు రాయకపోవచ్చు కానీ ఒక డిజాస్టర్ తో పోల్చడం ఏమిటని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అంటే సైనికుడు మహేష్ ఇమేజ్ వల్లే పోయిందనే ఇన్ డైరెక్ట్ మీనింగ్ ఆయన మాటల్లో వస్తుందిగా.

గతంలో ఒక్కడు రీ రిలీజ్ టైంలో లేదా పలు సందర్భాల్లో ఎక్కడా గుణశేఖర్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కానీ హఠాత్తుగా ఇలా చెప్పడం మహేష్ అభిమానులకు చిన్న షాక్ ఇచ్చింది. ఎవరు ఔనన్నా కాదన్నా ఒక్కడు సబ్జెక్టు మహేష్ బాబు మీద పర్ఫెక్ట్ గా ప్లే అయ్యింది. వేరే ఎవరో చేసినా హిట్టయ్యేదేమో కానీ అజయ్ గా సూపర్ స్టార్ పెర్ఫార్మన్స్ దాన్ని ఎన్నో మెట్లు పైకి తీసుకెళ్లింది. అదే మేజిక్ ఇతర భాషల్లో విజయ్, పునీత్ రాజ్ కుమార్, అర్జున్ కపూర్ చేయలేకపోయారు.

గుణశేఖర్ ఉద్దేశం ఏదైనా అర్థం మాత్రం ఇంకోలా వెళ్ళిపోయింది. ప్రస్తుతం నాలుగు కథలు సిద్ధం చేసుకున్నానని చెబుతున్న ఈ సీనియర్ దర్శకులు నెక్స్ట్ ఎవరితో చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. మూడు వందల కోట్ల బడ్జెట్ తనతో వర్కౌట్ కాదనే ఉద్దేశంతోనే హిరణ్యకసిపని డ్రాప్ అయ్యానని చెబుతున్న గుణశేఖర్ భవిష్యత్తులో దాన్ని టేకప్ చేయలేను అంటున్నారు. రుద్రమదేవి ఓ మోస్తరుగా ఆడినా శాకుంతలం దారుణంగా పోవడం దీనికి కారణం కావొచ్చు.