నాగార్జున అసలు పాయింట్ మిస్సయ్యారు

ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి వేల కోట్లతో తీసిన సినిమా ఏడాది ముందే రిలీజ్ ప్రకటించి దాన్ని అందుకోగలిగినప్పుడు, మనం మాత్రం ముందు రోజు కూడా ఫైనల్ కాపీ కోసం యుద్ధం చేస్తుంటామని తనతో పాటు అందరి మీద చురకలు వేశారు. కనీసం రెండు వారాల ముందు అన్నీ సిద్ధం చేసుకునే పరిస్థితి వస్తే ఎంత బాగుంటుందో అని వివరించారు. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం అక్షరాలా నిజం.

అయితే ఒడిస్సిని కేవలం రిలీజ్ డేట్ విషయంలోనే కాదు ఇతర అంశాల్లోనూ స్ఫూర్తిగా తీసుకోవాలి. మనలాగా హాలీవుడ్ సినిమాలు 28 రోజులకే ఓటిటిలో రావు. హీనపక్షం మూడు నెలలకు పైగా వెయిటింగ్ టైం ఉంటుంది. అవతార్ మూడో భాగం ఇండియా ఓటిటిలో అఫీషియల్ గా వచ్చింది కొన్ని వారాల క్రితమే. డిజిటల్ అగ్రిమెంట్లు చేసుకునే టైంలోనే నిర్మాణ సంస్థలు ఎంత గ్యాప్ ఉండాలనేది ఖచ్చితంగా రాసుకుంటాయి. దానికి అనుగుణంగానే ఓటిటి రిలీజ్ ఉంటాయి.

కానీ మన దగ్గర ప్యాన్ ఇండియా మూవీస్ సైతం అయిదు వారాలు మించి ఓటిటి గ్యాప్ ఇవ్వడం లేదు. ప్రీమియర్ షోలకు వెయ్యి, ఆరు వందలకు టికెట్లు అమ్మిన ఓజి, పెద్ది లాంటి సినిమాలు కూడా ఇదే బాట పట్టాయి. గత మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. ఒడిస్సిని ఇన్స్ పిరేషన్ గా తీసుకోవాలంటే ముందు మన ప్రొడ్యూసర్లు ఈ విషయం గురించి ఆలోచించాలి. లెనిన్ మూడో వారం కూడా డీసెంట్ గానే ఉంది. అయినా ఆగస్ట్ 7 స్ట్రీమింగ్ డేట్ పత్రికల్లో ఇచ్చేశారు.

నిర్మాతల కోణంలో పెట్టుబడి రికవరీకి వాళ్ళు చేస్తున్నది రైటేనని అనిపించవచ్చు. కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ యాంగిల్ చూడాలి. ఎలాగూ నెల తర్వాత ఓటిటిలో వస్తుందనే ధీమా ఉన్న ఆడియన్స్ ఖచ్చితంగా టికెట్లు కొనే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. యునానిమస్ అనిపించుకుంటేనే వాళ్ళను థియేటర్లకు రప్పించవచ్చు. సో గ్యాప్ ఎక్కువ ఉంటేనే ప్రేక్షకులు అధిక సంఖ్యలో సినిమా హాళ్లకు వస్తారు. నాగార్జున లాంటి సీనియర్లు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.