ఎంతో టాలెంట్ ఉన్నా సరే.. సరైన సక్సెస్ పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్న హీరో సత్యదేవ్. నటుడిగా అతను కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు సంపాదించాడు. ఒకవైపు క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేస్తూనే హీరోగా మంచి బ్రేక్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాడు సత్యదేవ్. కానీ ఇంకా అతను కోరుకున్న సక్సెస్ రాలేదు. గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురుగా విలన్ పాత్రలో అదరగొట్టిన అతను.. హీరోగా మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాడు.
అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. అందులో కృష్ణమ్మ కూడా ఒకటి. అగ్ర దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు. ఇది కథాబలం ఉన్న సినిమానే. ఇందులో సత్యదేవ్ పెర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. కానీ కమర్షియల్‌గా అనుకున్నంతగా ఆడలేదు.2024 ఎన్నికల టైంలో రిలీజై థియేటర్లలో పెద్దగాప్రభావం చూపకుండానే వెళ్లిపోయింది కృష్ణమ్మ.
ఐతే ఈ సినిమా థియేటర్లలో రిలీజైన ఆరు రోజులకే ఓటీటీలో రిలీజ్ కావడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే తన సినిమా అంత త్వరగా ఓటీటీలోకి వస్తున్న విషయం తనకు కూడా తెలియదని సత్యదేవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం. కృష్ణమ్మ తనకు హార్ట్ బ్రేక్ కలిగించిన సినిమాల్లో ఒకటని సత్యదేవ్ వ్యాఖ్యానించాడు. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నానని, తన బెస్ట్ పెర్ఫామెన్స్‌ల్లో ఇదొకటని చెప్పాడు.
ఐతే ఎన్నికల టైంలో రిలీజ్ కావడం ప్రతికూలమైందని, జనం తక్కువమందే సినిమా చూశారని, ఐతే నెమ్మదిగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు పెరుగుతున్న సమయంలో సినిమా హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసిందని సత్యదేవ్ అన్నాడు.
ఈ శుక్రవారం సినిమా థియేటర్లలో రిలీజైతే తర్వాతి గురువారం ఓటీటీలో రిలీజైపోవడం తనకూ షాకే అని, మేకర్స్ అలా డీల్ చేసుకున్న విషయం తనకు తెలియదని సత్యదేవ్ తెలిపాడు. తాను థియేటర్లలో ఉన్న సినిమాను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే..
ఒక నెటిజన్ ఓటీటీలో సినిమా రిలీజైన విషయం గుర్తు చేసి, నేనెందుకు థియేటర్‌కు వెళ్లాలి, డబ్బులు బొక్క అంటూ కామెంట్ పెట్టాడని సత్యదేవ్ చెప్పాడు. అప్పుడు చెక్ చేస్తే కానీ తనకు అసలు విషయం తెలియలేదని, అంత త్వరగా ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం చూసి తాను చాలా బాధ పడ్డానని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates