తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. కానీ ఆయన పిల్లల్లో ఎవ్వరూ ఇప్పటిదాకా సినిమాల వైపు చూడలేదు.
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్నప్పటికీ.. ఇంకా అతను హీరో అవతారం ఎత్తలేదు. బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణికి అస్సలు సినిమాలతో టచ్ లేదు. ఆమె దృష్టంతా వ్యాపారం మీదే ఉంటోంది. అప్పుడప్పుడూ కాస్త రాజకీయాల కోసం తిరుగుతుంటారు.
బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి మాత్రం కాస్త సినిమాలపై ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో ఆమె నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఇటీవలే ఆమె జ్యువెలరీ బ్రాండుకు ప్రచారకర్తగా మారి, అందుకోసం ఒక యాడ్ కూడా చేసింది.
భవిష్యత్తులో సినిమాల్లో కూడా నటిస్తుందో ఏమో తెలియదు కానీ.. ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియని టాలెంటును ఆమె పరిచయం చేయడం విశేషం.ఒక టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్‌తో కలిసి ఫాస్ట్ బీట్ మ్యూజిక్‌కు తేజస్విని డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అదిరిపోయే గ్రేస్‌తో ఆకట్టుకుంటుంది నందమూరి వారమ్మాయి. చాలా స్పీడుగా స్టెప్పులేయడంతో పాటు హావభావాలతోనూ మెప్పించింది తేజస్విని. ఈ వీడియో చూసి అందరూ అవాక్కవుతున్నారు.
బాలయ్య కూతురిలో ఇంత టాలెంట్ ఉందా, ఇన్నాళ్లూ ఈ ప్రతిభనంతా తనలోనే దాచేసుకుందే అని కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా బాలయ్య కూతురు కదా అంటూ తన డ్యాన్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరి ఈ టాలెంటును భవిష్యత్తులో వెండితెర మీదా నందమూరి అమ్మాయి చూపిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates