మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘మెగా 158’ ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడం ఈ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది. అయితే ఈ వేడుకలో చోటుచేసుకున్న ఒక చిన్న మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వచ్చి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడే ఇదే వీడియో మెగా, అల్లు అభిమానుల మధ్య కొత్త యుద్ధానికి తెరతీసింది.
ఆ వీడియోలో అల్లు అరవింద్ వచ్చి పలకరించినప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కుర్చీలోంచి పైకి లేవలేదు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంత పెద్ద వయసున్న సీనియర్ నిర్మాత పలకరించడానికి వచ్చినప్పుడు కనీసం లేచి నిలబడరా, ఇది ఆయనను అవమానించడమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి మెగా అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. వీడియోను జాగ్రత్తగా గమనిస్తే అరవింద్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ లేవబోయారని, కానీ అరవింద్ గారు వద్దు కూర్చోండి అన్నట్లుగా సైగ చేయడంతో వాళ్ళు ఆగిపోయారని లాజిక్స్ తీస్తున్నారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక ఐదు సెకన్ల వీడియోను పట్టుకుని ఫ్యాన్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తుండటం. వాస్తవానికి ఒక కుటుంబ వేడుకలో లేదా సినీ ఈవెంట్ లో ఇలాంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. మనకంటే పెద్దవాళ్లు వచ్చినప్పుడు మనం లేవబోవడం, వాళ్ళు క్యాజువల్ గా పర్లేదు కూర్చోండి అని చెప్పడం ప్రతి ఇంట్లో జరిగేదే. ఆ క్షణంలో అక్కడ ఉన్న రద్దీ, హడావుడిలో ఆ బ్రదర్స్ మధ్య ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ బయట ఉన్న వాళ్ళు మాత్రం తమకు తోచిన విధంగా కథలు అల్లుకుంటూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.
నిజానికి అల్లు, మెగా క్యాంపుల మధ్య ఈ సోషల్ మీడియా వార్ ఈనాటిది కాదు. గత కొన్నేళ్లుగా ఏదో ఒక చిన్న పాయింట్ దొరకడం, దాని మీద రెండు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఒకప్పుడు అంతా ఒకటే కుటుంబం అన్నట్లుగా ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు రెండుగా చీలిపోయి ఎవరికి వాళ్ళు తమ హీరోనే గొప్ప అంటూ ఇగోలకు పోతున్నారు. ఇప్పుడు ఆ పాత రచ్చకు ఈ వీడియో మళ్ళీ కారణంగా మారుతోంది.
ఇలాంటి వివాదాలపై అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ గతంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేమంతా ఒకే ఫ్యామిలీ అని బహిరంగ వేదికల మీద ఎన్నోసార్లు చెప్పారు. అయినా సరే సోషల్ మీడియాలో ఉండే ఒక వర్గం అభిమానులు మాత్రం ఆ మాటలను పట్టించుకునే స్థితిలో లేరు. స్టార్స్ ఎంత పాజిటివ్ గా ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక నెగెటివ్ కోణాన్ని వెతుక్కుంటూ ఇలాంటి వివాదాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates