మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు మౌనికకు కూడా తొలి వివాహం విఫలమైంది. మనోజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ మంచి సింక్ కుదిరి ఇద్దరూ అన్యోన్యంగా సాగిపోతున్నారు. ఐతే వీరి పెళ్లి తండ్రి మోహన్ బాబుకు, సోదరుడు విష్ణుకు నచ్చపోవడం.. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరితో మనోజ్‌కు గొడవ జరిగి.. అతను మంచు ఫ్యామిలీకి దూరం అయిపోవడం తెలిసిందే.
గత ఏడాది ఈ గొడవ వీధికెక్కి కొన్ని వారాల పాటు మీడియాలో వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. ఐతే తర్వాత గొడవ కొంచెం సద్దుమణిగింది కానీ.. ఇరు వర్గాల్లో విభేదాలు పూర్తిగా తొలగిపోయినట్లయితే కనిపించడం లేదు. మనోజ్ కుటుంబం ఇప్పటికీ వేరుగానే ఉంటోంది. కానీ ఈ గొడవ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడట్లేదు.
ఐతే మనోజ్ తాజాగా తమ కుటుంబ గొడవ గురించి కొంచెం సెటైరికల్‌గా మాట్లాడాడు. తమ కూతురు ఐక్య పేరిట మనోజ్, మౌనిక ఒక ఛారిటీ ఫౌండేషన్ మొదలుపెట్టారు. దీని గురించి మీడియాతో మాట్లాడే క్రమంలో.. అతడికి ఫ్యామిలీ గొడవ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి మనోజ్ బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ ఆ ప్రశ్న అడిగేటపుడు మైక్‌తో పాటు హెల్మెట్ కూడా తీసుకెళ్లండి’’ అంటూ మనోజ్ నవ్వేశాడు.
మంచు హీరో ఉద్దేశమేంటన్నది అందరికీ తెలిసిందే. గత ఏడాది మంచు ఫ్యామిలీ గొడవ ఉద్ధృతంగా నడుస్తున్న సమయంలో ఒక టీవీ విలేకరి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆయన మైక్ తీసుకుని దాంతో ఆ విలేకరి తలమీద కొడితే అతను తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో మనోజ్ ఇప్పుడు సెటైరికల్‌గా మాట్లాడాడు.
ఇదిలా ఉంటే.. తన భార్య మౌనిక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తుందని మనోజ్ ఆసక్తికర విషయం చెప్పాడు. భూమా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండగా.. తల్లిదండ్రుల మరణానంతరం పెద్దమ్మాయి అఖిల ప్రియ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఆమె ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రి కూడా. తమ్ముడు విశ్వవిఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉండగా.. వచ్చే ఎన్నికల్లో మౌనిక కూడా పోటీ చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి ఆమె ఏ పార్టీ తరఫున, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందన్నది ఆసక్తికరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates