దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను మూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఇంత వయసులోనూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సినిమాల నిర్మాణం తగ్గించినా పూర్తి ఆపేయలేదు. యాక్టివ్‌గానే ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలా దుర్మరణం పాలవడం బాధాకరం.
ఈ తరం ప్రేక్షకులకు ఆర్.బి.చౌదరి గొప్పదనం తెలియకపోవచ్చు. కానీ 90వ దశకం నుంచి ఓ రెండు దశాబ్దాల పాటు అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆర్.బి.చౌదరిని మించిన నిర్మాత లేరు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లను చూసి.. దర్శకుల పేర్లు చూసి జనం థియేటర్లకు వస్తుంటారు. కానీ ఒక నిర్మాతను నమ్మి కుటుంబ ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు రావడం ఆర్.బి.చౌదరి విషయంలో జరిగింది.
పోస్టర్ మీద సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే పేరు కనిపిస్తే చాలు.. అది మంచి విలువలతో కూడిన చక్కటి కుటుంబ కథా చిత్రం అయిఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులకు థియేటర్లకు పరుగులు పెట్టేవాళ్లు. ఫ్యామిలీ సినిమాలతో యువతను కూడా మెప్పించిన ఘనత ఆయన సొంతం.
సుస్వాగతం, సూర్యవంశం, రాజా, శీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైననీకు, నిన్నే ప్రేమిస్తా, శివరామరాజు, గోరింటాకు, సంక్రాంతి.. ఈ చిత్రాల వరుస చూస్తేనే చౌదరి బేనర్ వాల్యూ ఏంటో అర్థం అవుతుంది. వీటిలో ఒకటీ అరా తప్పా అన్నీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే.
రాజా, నువ్వు వస్తావని లాంటి సినిమాలైతే చరిత్ర సృష్టించాయి. చౌదరి బేనర్లో సినిమాలు చేయడాన్ని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఒక గౌరవంగా భావించేవాళ్లు. తమిళంలోనూ పుదువసంతం, నాట్టామై, లవ్ టుడే, సొల్లామలే, తుల్లాదమనం తుల్లుం, సూర్యవంశం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఆయన నిర్మించారు.
రంగం సినిమాతో స్టార్‌గా అవతరించిన జీవా ఆయన తనయుడే. ఐతే మారిన ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేకపోవడంతో ఒక దశ దాటాక చౌదరి హవా తగ్గింది. ఐతే ఒకప్పట్లా హిట్లు కొట్టకపోయినా.. ఆయన ప్రొడక్షన్ ఏమీ ఆపలేదు. గత ఏడాది కూడా మారీశన్ అనే మంచి సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates