సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు. డెకాయిట్, డార్లింగ్ ఆడుతున్నవి మినహాయించి మిగిలినవి ఓ పది మంది టికెట్లు కొంటే తప్ప వేయలేని పరిస్థితి నెలకొంది. కొత్త రిలీజుల మీద బజ్ కూడా అంతంత మాత్రంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు రోజుకో గండంగా గడుపుతున్నారు. ఒకవేళ చెప్పిన టైంకి కొంచెం అటుఇటు అయినా పెద్ది, ది ప్యారడైజ్ వచ్చి ఉంటే ఇవాళ సీన్ ఇంకోలా ఉండేది.

ఈ నేపథ్యంలో మే ఒకటి వస్తున్న గాయపడ్డ సింహం, జెట్లీ ఏదో అద్భుతాలు చేస్తాయనే నమ్మకం ఎక్కువగా లేకపోయినా సర్ప్రైజ్ హిట్ అయితే చాలానే ఆశతో ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మే 15 మా ఇంటి బంగారం వస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ పోషించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ కు బిజినెస్ ఎంక్వయిరీలు బాగున్నాయట. ముందు అనుకున్న రేట్ల కన్నా ఓ పది ఇరవై శాతం ఎక్కువే రావొచ్చని అంచనా వేస్తున్నారు.

సమంతా భర్త రాజ్ నిడిమోరు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ ప్రాజెక్టు బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. కంటెంట్ కనక కనెక్ట్ అయితే సామ్ ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ డ్రామాని మిక్స్ చేసిన తీరు ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రీ రిలీజ్ లీక్స్ సహజమే కానీ అసలు తీర్పు వచ్చేది థియేటర్ లో మొదటి షో పడ్డాకే. టీమ్ అయితే ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంది.

మా ఇంటి బంగారంకు చెప్పుకోదగ్గ పోటీ ఒకటే ఉంది. సూర్య వీరభద్రుడు ఒక రోజు ముందు వస్తోంది. అయితే కంగువ, రెట్రో ఫలితాల వల్ల సూర్య సినిమాలకు ముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. అందులోనూ దర్శకుడు ఆర్జె బాలాజీకి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ లేదు. సో సామ్ టెన్షన్ పడాల్సిన పని ఉండదు. శాకుంతలం దారుణంగా డిజాస్టర్ అయ్యాక మా ఇంటి బంగారం బలమైన కంబ్యాక్ అవుతుందని సామ్ నమ్మకంగా ఉంది. చూడాలి ఏ మేరకు నెరవేరుతుందో.