ఆఫీస‌ర్ త‌ర్వాత వ‌ర్మ నుంచి ఇదే..

రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పార్ట్ టైం ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. ఎప్పుడో కానీ మెగా ఫోన్ ప‌ట్టుకోవ‌ట్లేదు. ఎ రామ్ గోపాల్ వ‌ర్మ ఫిలిం అని ప్ర‌తి సినిమాకూ ప‌డుతోంది కానీ.. అవి ఆయ‌న తీస్తున్న‌వి కావు. అగ‌స్త్య మంజు అని, సిద్దార్థ తాతోలు అని.. ఆనంద్ చంద్ర అని.. కొత్త కొత్త కుర్రాళ్ల‌తో సినిమాలు తీయించి జ‌నాల మీదికి వ‌దిలేస్తున్నాడు వ‌ర్మ‌. వాటిలో ఏమాత్రం క్వాలిటీ లేక‌.. క‌నీస స్థాయిలోనూ జ‌నాల‌ను మెప్పించ‌లేక.. ఆ సినిమాలు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నాయి.

వ‌ర్మ చివ‌ర‌గా పూర్తి స్థాయిలో తీసిన ఫీచ‌ర్ ఫిలిం అంటే.. రెండున్న‌రేళ్ల కింద‌ట వ‌చ్చిన ఆఫీస‌ర్‌యే. అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన ఆ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత పెద్ద డిజాస్ట‌ర్ అయిందో తెలిసిందే. ఆ సినిమా ఫ‌లితం త‌ర్వాత వ‌ర్మ ఏమీ మార‌లేదు. మ‌రింత నాసిర‌కం, బూతు సినిమాలే తీస్తూ వ‌చ్చాడు.

ఇప్పుడాయ‌న కొంచెం సీరియ‌స్‌గా మ‌ళ్లీ ఓ ఫుల్ లెంగ్త్ ఫీచ‌ర్ ఫిలిం చేశాడు. ఆ చిత్ర‌మే.. 12 ఓ క్లాక్. మూడేళ్ల కింద‌ట స‌ర్కార్ తీశాక మ‌ళ్లీ బాలీవుడ్లో సినిమా చేయ‌ని ఆయ‌న‌కు.. మ‌ళ్లీ హిందీలో ఇదే తొలి సినిమా. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మార్కండ్ దేశ్ పాండే, ఆశా సైని త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇది ప‌క్కా హార్ర‌ర్ సినిమా.
అప్ప‌ట్లో రాత్, భూత్ లాంటి చిత్రాల‌తో వ‌ర్మ ఎంత‌గా భ‌య‌పెట్టాడో తెలిసిందే. ఐతే అప్ప‌టిక‌వి కొత్త‌గా ఉన్నాయి. కానీ అదే స్ట‌యిల్లో 12 ఓ క్లాక్‌ను చుట్టేశాడ‌ని దీని తాజా ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. విజువ‌ల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ భ‌య‌పెట్టేలా ఉన్నాయి కానీ.. గ‌త కొన్నేళ్ల‌లో వ‌ర్మ సినిమాల క్వాలిటీని బ‌ట్టి చూస్తే దీని మీద ఎంత త‌క్కువ అంచ‌నాలు పెట్టుకుంటే అంత మంచిదేమో. ఈ చిత్రానికి కీర‌వాణి నేప‌థ్య సంగీతం అందించ‌డం అతి పెద్ద విశేషం. కొత్త ఏడాదిలో రిలీజ‌య్యే తొలి సినిమా ఇదేన‌ట‌. జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించాడు.