మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధికంగా రూ.200 కోట్ల బడ్జెట్లో మొదలైన సినిమా.. విశ్వంభర. ఈ సినిమా మొదలయ్యే సమయానికి ఆ బడ్జెట్ చూసే ఔరా అనుకున్నారు. ఇంతకంటే తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ‘సైరా’నే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. కాకపోతే తర్వాత మార్కెట్ లెక్కలు మారాయి. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. పైగా ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ మూవీ.. అందులోనూ ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి.. సినిమాకు ఢోకా ఉండదనే అనుకున్నారు.
ఐతే ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక లెక్క మారిపోయింది. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో టీం అలెర్ట్ అయింది. అప్పటిదాకా ఎంతో ఖర్చు పెట్టి తీసిన విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ అంతా పక్కన పెట్టి మళ్లీ వీఎఫెక్స్ పనులు కొత్తగా మొదలుపెట్టింది. దీని వల్ల సినిమా బాగా ఆలస్యం అయింది కూడా. వీఎఫెక్స్ బడ్జెట్ రెట్టింపవడం.. ఆలస్యం వల్ల వడ్డీల భారం పడడంతో బడ్జెట్ హద్దులు దాటేసింది.
ఐతే ఆ లెక్క మరీ రూ.400 కోట్లకు చేరి ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ తాజాగా కెమెరామన్ ఛోటా కే నాయుడు.. ఈ సినిమా బడ్జెట్ అంత అయినట్లు వెల్లడించి షాకిచ్చాడు. మెగాస్టార్ ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’తో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చారు.
‘విశ్వంభర’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న విజువల్ వండర్. అయినా సరే.. రూ.400 కోట్ల బడ్జెట్‌ను రికవర్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఒక వంద కోట్లు రాబట్టినా.. థియేటర్ల నుంచి రూ.300 కోట్ల మేర షేర్ రాబడితే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి.
అంత షేర్ రావాలంటే మూవీ రూ.500 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేయాలి. అది అంత తేలికైన విషయం కాదు. బాహుబలి, పుష్ప సినిమాల స్థాయిలో పాన్ ఇండియా ప్రేక్షకుల ఆమోదం పొందితే తప్ప సినిమాకు ఆ స్థాయిలో వసూళ్లు రావు. దీన్ని బట్టి ఔట్ పుట్ ఎంత గొప్పగా ఉండాలో అంచనా వేయొచ్చు. మరి ఎంతో టైం తీసుకుని కష్టపడుతున్న వశిష్ఠ అండ్ టీమ్ ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates