సినీ పరిశ్రమలో ఎవరి దగ్గరా అసిస్టెంటుగా పని చేయకుండానే.. షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో దర్శకుడిగా అవకాశం అందుకుని.. ‘రన్ రాజా రన్’ అనే చిన్న సినిమాతో పరిచయం అయి.. ఆ సినిమాతో మెప్పించి ఏకంగా ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా తీసే అవకాశం పట్టేసి.. రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో ‘సాహో’ను తీర్చిదిద్దిన దర్శకుడు సుజీత్. ఈ సినిమా తీస్తున్నపుడు అతడి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ సినిమా రిలీజయ్యాక కథ మొత్తం తిరగబడింది.
సాహో రిలీజైన ఏడాదికి కూడా అతను తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు. మెగాస్టార్‌తో ‘లూసిఫర్’ రీమేక్‌లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ సినిమా నుంచి సుజీత్‌ను తప్పించారా.. అతనే తప్పుకున్నాడా అన్నది తెలియదు. తర్వాతి సినిమా గురించి అతనైతే ఏమీ మాట్లాడట్లేదు.
ఐతే సుజీత్ కొత్త సినిమా గురించి ఇప్పుడో ఆసక్తికర సమాచారం బయటికి వస్తోంది. అతను టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. ‘యురి’ సహా కొన్ని సినిమాలతో మంచి పేరు సంపాదించి స్టార్‌గా ఎదుగుతున్న విక్కీ కౌశల్‌తో అతను సినిమా చేసే అవకాశాలున్నాయట. అతడికి ఓ కథను నరేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట సుజీత్. విక్కీ ఓకే అంటే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉందట.
‘సాహో’ మన దగ్గర ఫ్లాపే కానీ హిందీలో బాగా ఆడింది. సుజీత్ పేరు అక్కడ కొంత చర్చనీయాంశం అయింది. ఇంత భారీ సినిమా తీసిన దర్శకుడు ఎవరు అని ఆరా తీశారు. ‘సాహో’ ఆడకపోయినా అందులో దర్శకుడి ముద్ర కనిపిస్తుంది. ఆ గుర్తింపుతోనే సుజీత్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వర్కవుట్ అయి.. సక్సెస్ అయితే సుజీత్ అక్కడే సెటిలైనా ఆశ్చర్యం లేదేమో.