మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక తన సినీ ప్రయాణం కొంచెం నెమ్మదించింది. ప్రమాదం జరిగింది 2021లో కాగా.. అతను ఆ తర్వాత చేసింది రెండే సినిమాలు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ అయింది. మరొకటి ‘బ్రో’ సరిగా ఆడలేదు. ఈ రెండు చిత్రాల తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని ‘సంబరాల యేటిగట్టు’ అనే భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు.
కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తేజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘విరూపాక్ష’ వంద కోట్ల క్లబ్బులోకి వెళ్లినప్పటికీ.. ఆ సినిమా ఆధారంగా తేజు మార్కెట్ మీద ఒక అంచనాకు రావడం కష్టమే. కానీ నిరంజన్ రెడ్డి మాత్రం తేజు కొత్త సినిమా మీద రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టే అంచనాతో రంగంలోకి దిగాడు. కానీ ఈ సినిమా ఆ బడ్జెట్ మార్కును దాటేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
గత ఏడాది దసరాకే రావాల్సిన ‘సంబరాల యేటి గట్టు’ ఈ వేసవికి అయినా వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వర్కింగ్ డేస్ పెరిగిపోయాయి. బడ్జెట్ హద్దులు దాటేసింది. ఇప్పుడేమో క్లైమాక్స్‌ను అత్యంత భారీగా తీర్చిదిద్దుతున్నారని.. అందుకోసమే ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఐతే సినిమాకు హైప్ తేవడం కోసం చిత్ర బృందం ఇలా లీక్స్ ఇస్తోందా.. లేక నిజంగానే రూ.20 కోట్లు పెడుతున్నారా అన్నది తెలియదు కానీ.. ఆల్రెడీ బడ్జెట్ హద్దులు దాటేసినట్లు వార్తలు వస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఇంకో 20 కోట్లు పెట్టి క్లైమాక్స్ తీయడం మీద ఇండస్ట్రీ జనాల్లో.. సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తేజు మీద, కొత్త దర్శకుడి మీద నిర్మాతకు మరీ ఇంత నమ్మకమేంటి.. ఇంతింత ఖర్చు పెట్టేసి సినిమాను బిజినెస్ పరంగా వర్కవుట్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates