రెండేళ్ల కిందట రంగస్థలంతో నాన్ బాహుబలి హిట్టు కొట్టి తిరుగులేని స్థాయిని అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఐతే ఆ సినిమాతో చరణ్ ప్రయోగం చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన చిత్రం ధృవ. ఆ చిత్రానికి ముందు చరణ్ పరిస్థితి ఏమీ బాగా లేదు. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ సినిమాలు ఫెయిలై నిరాశలో ఉన్నాడు. అతడి కాన్ఫిడెన్స్ కూడా దెబ్బ తినేసింది. మరీ రొడ్డ కొట్టుడు సినిమాలు చేస్తున్నాడన్న ముద్ర కూడా పడిపోయింది.
అలాంటి సమయంలో చరణ్ తన శైలికి భిన్నమైన థ్రిల్లర్ మూవీ ధృవలో నటించాడు. అది చరణ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసింది. అతను కొత్త కథలకు సూటవుతాడని, భిన్నంగా నటించగలడని ఆ సినిమాతోనే రుజువైంది. ఈ చిత్రానికి మాతృక అయిన తనీ ఒరువన్‌తో తమిళంలో సంచలనం సృష్టించిన దర్శకుడు మోహన్ రాజా.
రీమేక్‌లకు పేరుపడ్డ మోహన్ రాజా.. తనీ ఒరువన్‌తో తన సత్తా ఏంటో చూపించాడు. ఈ సినిమాతో పరోక్షంగా రామ్ చరణ్ కెరీర్‌కూ అతను ఉపయోగపడ్డాడు. తనీ ఒరువన్ తర్వాత వేలైక్కారన్ అనే మరో సినిమాతోనూ మెప్పించిన మోహన్.. ఇప్పుడు అనుకోకుండా తెలుగులో ఓ రీమేక్ సినిమా తీయబోతున్నాడు. అది మెగాస్టార్ హీరోగా నటించనున్న లూసిఫర్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తనీ ఒరువన్ ద్వారా చరణ్‌కు ఉపయోగపడ్డ మోహన్.. లూసిఫర్ రీమేక్‌కు దర్శకుడిని తేల్చుకోలేక సతమతం అవుతున్న చిరుకు సమాధానంగా నిలిచాడు. ఈ సినిమాకు మోహన్‌ను రెకమండ్ చేసింది చరణే అంటున్నారు.
చాలామంది ఈ రీమేక్‌లో నటించొద్దని చిరుకు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రాన్ని తనదైన శైలిలో మలిచి చిరు ఈ రీమేక్‌లో నటించడం కరెక్టే అని రుజువు చేయాల్సిన బాధ్యత మోహన్ రాజాపై ఉంది. ఇంతకుముందు కొడుక్కి సాయం చేసిన మోహన్ రాజా.. ఇప్పుడు తండ్రికి ఏమేర ఉపయోగపడతాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates