దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఆ చిత్రం డిజిటల్ రిలీజ్‌కు వచ్చేసింది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఐతే రిలీజ్ ముంగిట ఆ సంస్థ ‘దురంధర్’ గురించి ఏమాత్రం హడావుడి చేయలేదు.
ఇలాంటి బ్లాక్‌బస్టర్, మోస్ట్ వాంటెడ్ మూవీ గురించి కొన్ని రోజుల ముందు నుంచి బాగా ప్రమోట్ చేసుకుంటాయి స్ట్రీమింగ్ సంస్థలు. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం అలా చేయలేదు. అసలు గురువారం అర్ధరాత్రి నుంచి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగే స్థాయిలో సైలెన్స్ మెయింటైన్ చేసింది. చివరికి లెక్క ప్రకారమే సినిమా మిడ్ నైట్ 12 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఐతే ఇందులో సినిమా చూసిన వాళ్లంతా పెదవి విరుస్తున్నారు.
బిగ్ స్క్రీన్ మీద అద్భుతమైన అనుభూతిని పంచిన ‘దురంధర్’ టీవీల్లో విజువల్స్, సౌండ్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కలర్ గ్రేడింగే మారిపోయింది. పాలిపోయిన లుక్‌తో విజువల్స్ కనిపించడంతో ప్రేక్షకులు షాకయ్యారు. సౌండ్ కూడా సరిగా లేదు. ఎక్కువ సౌండ్ పెట్టినా.. సరైన ఫీల్ రాని పరిస్థితి.
యూట్యూబ్‌లో ఉన్న ఈ సినిమా పాటలు, ట్రైలర్, ఇతర ప్రోమోల తాలూకు విజువల్స్‌ను.. నెట్‌ఫ్లిక్స్ విజువల్స్‌ను పక్క పక్కన పెట్టి చూపిస్తూ.. రెంటికీ ఎంత మార్పు ఉందో బట్టబయలు చేస్తున్నారు నెటిజన్లు. పనిగట్టుకుని ఈ స్ట్రీమింగ్ సంస్థ సినిమాను చెడగొట్టినట్లు ఉందంటూ ఆడియన్స్ మండిపడుతున్నారు.
థియేటర్లలో సినిమా చూసిన వాళ్లకైతే తేడా స్పష్టంగా కనిపిస్తుండడంతో నెట్‌ఫ్లిక్స్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ చూశాక అయినా సినిమాకు మళ్లీ మెరుగులు దిద్దుతుందేమో చూడాలి నెట్‌ఫ్లిక్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates