బాలీవుడ్ నుంచి హీరోయిన్లు దక్షిణాదికి దిగుమతి కావడం దశాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయమే. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీల్లో స్థానిక కథానాయికల కంటే నార్త్ ఇండియన్ హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. ఉంటున్నారు. దక్షిణాదిన ఏదో ఒక భాషలో ఒక బాలీవుడ్ హీరోయిన్‌కు పెద్ద హిట్ పడిందంటే.. ఇక్కడున్న ఇతర భాషల్లోనూ ఆటోమేటిగ్గా ఛాన్సులు వచ్చేస్తాయి. సౌత్ అంతటా స్టార్ స్టేటస్ సంపాదించేస్తారు.
ముఖ్యంగా తెలుగులో పేరొస్తే.. తమిళంలో అవకాశాలు వస్తాయి. తమిళంలో హిట్ కొడితే తెలుగులోనూ ఛాన్సులకు లోటు ఉండదు. ఐతే నాలుగేళ్ల కిందటే తెలుగులో ‘సీతారామం’ లాంటి కల్ట్ మూవీ చేసిన మృణాల్.. దక్షిణాదిన ఇంకే భాషలోనూ ఇప్పటిదాకా నటించలేదు. ‘సీతారామం’ తమిళం, మలయాళంలోనూ బాగా ఆడినా సరే.. ఆయా భాషల్లో సినిమాలు చేయలేదు మృణాల్. ముఖ్యంగా ఆమె తమిళంలో ఇప్పటిదాకా నటించకపోవడం ఆశ్చర్యకరమే.
ఐతే ఎట్టకేలకు కోలీవుడ్లో మృణాల్ తొలి అవకాశం అందుకుంది. అక్కడ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన శింబు సరసన ఈ మరాఠీ భామ నటించబోతోంది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అసురన్’ సినిమా చేస్తున్న శింబు.. దీని తర్వాత ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఒక రొమాంటిక్ మూవీ చేయబోతున్నాడు. అందులో మృణాల్ కథానాయికగా నటించబోతోంది.
శింబు, మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ‘మన్మథ’తో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాక శింబు సినిమాలు తెలుగులో వరుసగా రిలీజయ్యాయి. కానీ తర్వాత ఆగిపోయాయి. కొన్నేళ్లుగా అతను హీరోగా చేసిన సినిమాలు ఇక్కడ విడుదల కావట్లేదు. ఐతే మృణాల్ కథానాయికగా నటించడం, ‘డ్రాగన్’ మూవీతో అశ్వత్‌కు తెలుగులోనూ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం తెలుగులో కూడా ఒకేసారి విడుదలయ్యే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates