శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక హంగుల‌తో సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు శంక‌ర్. ఒక స‌మ‌యంలో ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఒక వెలుగు వెలిగాడు శంక‌ర్.

భారీ బ‌డ్జెట్ల‌లో సినిమాలు తీస్తూ.. ఆ బ‌డ్జెట్ల‌కు త‌గ్గ విజువ‌ల్ మాయాజాలంతో క‌ట్టిప‌డేసేవాడు శంక‌ర్. కానీ ఐ సినిమా ద‌గ్గ‌ర్నుంచి శంక‌ర్ జాత‌కం తిర‌గ‌బ‌డింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చు త‌ప్పితే.. కంటెంట్‌లో బ‌లం లేక ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌ర‌చ‌డం మొద‌లైంది. 

రోబో-2 బాగానే ఆడినా సంతృప్తినివ్వ‌లేదు. అందులో చాలా వృథా ఖ‌ర్చు క‌నిపించింది. ఇక ఇండియ‌న్-2, గేమ్ చేంజ‌ర్ సినిమాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ రెండు చిత్రాల బ‌డ్జెట్లూ హ‌ద్దులు దాటిపోయి, నిర్మాత‌లు దారుణంగా దెబ్బ తిన్నారు.

దీంతో శంక‌ర్ కొత్త సినిమాకు నిర్మాత‌లు, స్టార్ హీరోలు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ప్పుడు శంక‌ర్‌తో సినిమా అంటే నిర్మాత‌లు, హీరోలు ఎగ‌బ‌డేవారు. అలాంటి ద‌ర్శ‌కుడికి ఈ ప‌రిస్థితి రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఐతే శంక‌ర్ చేయాల‌నుకున్న డ్రీమ్ ప్రాజెక్టు వేల్పారి కోసం ఎట్ట‌కేల‌కు నిర్మాత దొరికిన‌ట్లు స‌మాచారం. సౌత్ ఇండియన్ ఫిలిం మేక‌ర్స్‌తో భాగ‌స్వామ్యం కోసం ఆస‌క్తి చూపించే బాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత జ‌యంతిలాల్ గ‌ద… శంక‌ర్‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలిసింది.

ఆర్ఆర్ఆర్ స‌హా ప‌లు సౌత్ మూవీస్‌ను ఉత్త‌రాదిన‌ డిస్ట్రిబ్యూట్ చేయ‌డంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ తీసిన జ‌యంతి లాల్.. త‌న పెన్ మూవీస్ బేన‌ర్ మీద శంక‌ర్ డ్రీమ్ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేయ‌డానికి అంగీకారం తెలిపాడట‌. కాక‌పోతే ఆయ‌న శంక‌ర్‌కు ఒక కండిష‌న్ పెట్టినట్లు స‌మాచారం. 

ఈ సినిమా బ‌డ్జెట్ ఎంతో ఫిక్స్ చేసి.. ప్రొడ‌క్ష‌న్ షెడ్యూళ్ల గురించి ఒక ప్లాన్ ఇవ్వాల‌ని శంక‌ర్‌ను అడిగాడ‌ట జ‌యంతిలాల్. అంతే కాక చెప్పిన‌ బ‌డ్జెట్‌ను మించ‌కుండా సినిమాను పూర్తి చేస్తాన‌ని అగ్రిమెంట్ మీద కూడా సంత‌కం చేయాల‌ని చెప్పాడ‌ట‌.

దీనికి అంగీక‌రిస్తే సినిమా చేయ‌డానికి ఓకే అని జ‌యంతిలాల్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఐతే దాదాపుగా శంక‌ర్ ఏ సినిమా కూడా అనుకున్న బ‌డ్జెట్లో పూర్తి కాని నేప‌థ్యంలో ఈ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఈ కండిష‌న్‌కు ఓకే చెబుతాడా అన్న‌ది చూడాలి.