సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ.. చాలా ఏళ్లుగా డిజిటల్ రూపంలోకి మారింది. ఐ బొమ్మ లాంటి పైరసీ వెబ్ సైట్లకు కళ్లెం వేసినా సరే.. ఏదో ఒక రూపంలో పైరసీ ప్రింట్లు బయటికి వస్తూనే ఉన్నాయి. అవి సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి.
పైరసీని నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా సరే.. పూర్తిగా నివారించడం మాత్రం సాధ్యపడట్లేదు. ఆ మధ్య ఈటీవీ విన్ వాళ్లు గట్టి ప్రయత్నమేదో చేసి ‘క’ సినిమా డిజిటల్ వెర్షన్ పైరసీని కొన్ని రోజులు ఆపగలిగారు. కానీ తర్వాత షరా మామూలే. ఐతే ఇప్పుడు యువ నిర్మాత వంశీ నందిపాటి.. విప్లవ్ అనే ఎడిటర్ పైరసీని ఆపడానికి తీర్చిదిద్దిన యాప్ గురించి ప్రస్తావించారు. విప్లవ్ గతంలో ‘బేబీ’ సినిమాకు పని చేశారు.
‘హే భగవాన్’ అనే కొత్త సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో విప్లవ్ ‘వ్యూ’ (view) పేరుతో తయారు చేసిన యాప్ గురించి వంశీ వెల్లడించాడు. మామూలుగా మేకింగ్ దశలో ఉన్న సినిమాల రష్ చూడడానికి ఎంపీ4 ఫైల్స్ పంపించండి, ఎడిట్ రూంకి ఏం వస్తాం అని అంటుంటామని.. కానీ విప్లవ్ మాత్రం రష్ చూడడానికి చాలా పెద్ద ప్రాసెస్ పెట్టాడని వంశీ తెలిపాడు.
ఈ యాప్‌లో సినిమా ఫైల్స్ పెడతారనీ.. డిజి లాకర్లోకి వెళ్లి ఆధార్ కార్డ్ డీటైల్స్ ఇచ్చి సైన్ చేస్తే తప్ప దాన్ని యాక్సెస్ చేయలేమని.. దాని ఫైర్‌వాల్ బ్రేక్ చేయడం అంత తేలిక కాదని వంశీ తెలిపాడు. పెద్ద సినిమాలు, మంచి సినిమాలను ఈ యాప్ ద్వారా పైరసీ చేయకుండా ఆపవచ్చని.. ఈ ప్రాసెస్ కొంచెం ఆలస్యం అయినా సరే సినిమాలను బాగా ప్రొటెక్ట్ చేస్తుందని..
దీన్ని అందరూ ఉపయోగిస్తే మంచిదని వంశీ అభిప్రాయపడ్డాడు. మరి ఇండస్ట్రీ జనాలు వంశీ నందిపాటి మాటల్ని అనుసరించి ఈ యాప్‌ను సీరియస్‌గా తీసుకుని.. దీని ద్వాారా పైరసీకి బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates