చిరు ‘కమిట్మెంట్’ వ్యాఖ్యలకు చిన్మయి కౌంటర్

ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని.. అమ్మాయిలు స్ట్రిక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటే వారి జోలికి ఎవ్వరూ రారని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. చిరు చెప్పింది కరెక్టే అంటూ కొందరు మద్దతుగా నిలిస్తే.. కాస్టింగ్ కౌచ్ గురించి అలా ఎలా కొట్టిపారేస్తారని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాస్టింగ్ కౌచ్ మీద ఎప్పట్నుంచో గళం వినిపిస్తున్న గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.. తాజాగా చిరు వ్యాఖ్యల మీద స్పందించారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందన్నది ముమ్మాటికీ వాస్తవమంటూ ఆమె అనేక ఉదాహరణలు చెప్పారు. చిరంజీవి తరంలో పురుష ఆర్టిస్టులు మహిళలతో స్నేహితుల్లా, కుటుంబ సభ్యుల్లా మెలిగి ఉండొచ్చు, ఒకరినొకరు గౌరవించి ఉండొచ్చని.. వాళ్లంతా దిగ్గజాలని.. కానీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అన్నది ఇండస్ట్రీ చాలా తీవ్రమైన సమస్యగా మారిందని ఆమె నొక్కి వక్కాణించారు.

షావుకారు జానకి లాంటి మహిళలే స్వయంగా.. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా మహిళలు గొంతెత్తడాన్ని తప్పుబట్టడం విడ్డూరమన్న చిన్మయి.. ఇండస్ట్రీలో ‘ఫుల్ కమిట్మెంట్’ అన్న పదానికి అర్థమే వేరని ఆమె అభిప్రాయపడింది.

ఒక సంగీత దర్శకుడు ఓ గాయనిపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో ఆమె ఒక గదిలో తలుపులు వేసుకుని ఉండిపోతే ఒక సీనియర్ కాపాడిన ఘటన తనకు తెలుసని చిన్మయి వ్యాఖ్యానించింది. అలాగే ఒక పురుష గాయకుడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడంతో పాటు తన ప్రైవేట్ పార్ట్స్‌ ఫొటోలు పంపి తప్పుడు పని చెయ్యాలని అడిగిన ఉదంతాలు కూడా ఉన్నాయని చిన్మయి చెప్పింది.

ఇక వైరముత్తు తన తల్లి తనతో పాటు ఉండగానే తనను లైంగికంగా వేధించాడని.. ఆ దాడి తాను కోరుకుని చేయించుకున్నది కాదని.. ఆయన్ని ఒక మెంటార్‌గా భావించి ఎంతో గౌరవిస్తే తన పట్ల అంత దారుణంగా ప్రవర్తించాడని.. ఇండస్ట్రీలో పురుషులు మహిళలకు పని ఇస్తున్నారంటే బదులుగా శృంగారం అందించాలని బలంగా నమ్ముతారని ఆమె స్పష్టం చేసింది.