దురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ కు ఏకంగా యాభై రోజుల గ్యాప్ వచ్చేసింది. మధ్యలో వచ్చిన రాజా సాబ్ లాంటివి తీవ్రంగా నిరాశ పరచడంతో బయ్యర్ల ఆశలన్నీ బోర్డర్ 2 మీదే ఉన్నాయి. మూడు గంటల ఇరవై నిమిషాల సుదీర్ఘ నిడివితో వచ్చిన ఈ వార్ డ్రామా మొదటి వీకెండ్ కే దురంధర్, చావా రికార్డులకు ఎసరు పెట్టడం గమనార్హం.
శుక్రవారం నుంచి ఆదివారం మూడు రోజులకు గాను 130 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు వచ్చినట్టు డిస్ట్రిబ్యూటర్ల సమాచారం. మొత్తం గ్రాస్ ప్రకారం చూసుకుంటే నూటా డెబ్భై కోట్లకు పైగానే వసూలయ్యింది. ఇది ఏ మాత్రం అంచనాలకు అందనంత పెద్ద నెంబర్.
బోర్డర్ 2 ఇంతగా వర్కవుట్ కావడానికి ప్రధాన కారణం 1997లో మొదటి భాగం చూపించిన ఇంపాక్ట్ అని చెప్పాలి. అప్పటి జనరేషన్ ఊగిపోయేలా చేసిన బోర్డర్, దాని దర్శకుడు జెపి దత్తాకు అవార్డులు, డబ్బులు బోలెడు తీసుకొచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తర్వాత ఎన్ని యుద్ధ సినిమాలు వచ్చాయో లెక్క చెప్పడం కష్టం.
మొన్నటి 120 బహద్దూర్, ఇక్కీస్ లాంటి వాటికి ఇన్స్ పిరేషన్ బోర్డరే. అంత ఘనమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న మూవీకి సీక్వెల్ కావడంతో జనాలు ఎగబడ్డారు. అంచనాలకు తగ్గట్టే ఉండటంతో హౌస్ ఫుల్ బోర్డులతో ఉత్తరాది థియేటర్లు కళకళలాడుతున్నాయి. నిన్న చాలా చోట్ల మిడ్ నైట్ షోలు వేశారు.
ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి ఫైనల్ రన్ గురించి కంక్లూజన్ కు రాలేం కానీ బోర్డర్ 2కి దురంధర్ ని దాటే అవకాశాలు ఉన్నప్పటికీ అంత సులభమైతే కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా యునానిమస్ రెస్పాన్స్ బోర్డర్ 2కి రాలేదు. కొత్తగా అనిపించలేదని, ల్యాగ్ ఫీలయ్యే తరహాలో తమిళ తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కొందరు ఫీలయ్యారు.
ఇది అధిక శాతంలో ఉంటే తర్వాత డ్రాప్ ఉంటుంది. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో తీసిన బోర్డర్ 2కి మెయిన్ పిల్లర్ గా నిలిచింది సన్నీ డియోల్ పెర్ఫార్మన్సే. రిలీజ్ కు ముందు ట్రోల్ అయిన వరుణ్ ధావన్ సైతం నటనతో శభాష్ అనిపించుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates