మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని చెబుతుంటారు. ఈ క్రమంలో అద్భుతమైన ఉదాహరణలు కూడా చెబుతుంటారు. ఆ మధ్య ఒక మహిళ తనను విమర్శించిన రాజకీయ నాయకుడిని చెడామడా తిడుతూ తీవ్ర ఉద్వేగానికి గురైన విషయాన్ని చెప్పుకుని చిరు ఎమోషనల్ అయ్యారు.
తాజాగా తన కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్లలో భాగంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన చిరు.. ఒక మహిళా అభిమాని తన మీద చూపించిన అభిమానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘‘ఇటీవల ఒకావిడ మాట్లాడిన వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియోలో ఆమె ‘ఏమయ్యా చిరంజీవి ఎప్పటి నుంచో కష్టపడుతూనే ఉన్నావు. మమ్మల్ని ఆనందింపజేయడానికి ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పటికీ అలాగే పని చేస్తున్నావు. డబ్బుల కోసం నువ్వు పని చేస్తున్నావని నేను అనుకోను. నువ్వు ఇలా కష్టపడుతుంటే బాధగా ఉంది’ అని అన్నారు.
నిజంగా ఆ తల్లికి ఈ సభా ముఖంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఇది అందరూ ఇచ్చే ప్రశంస కాదు. ఇలాంటి అభిమానులను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ మాటలకు ఆనందంతో నా కళ్లు చెమర్చాయి.
అమ్మా మీకు ఆనందం ఇవ్వడానికి నేను కష్టపడినా సరే అందులో సంతోషాన్ని పొందుతున్నాను. చిరంజీవి మమ్మల్ని అలరించాలని కోరుకునే అభిమానుల పాజిటివ్ ఎనర్జీ నుంచే నాకు ఈ శక్తి వస్తోంది. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు చిరంజీవి.
Gulte Telugu Telugu Political and Movie News Updates