తొమ్మిది నెలల పాటు సినీ ప్రియులను థియేటర్లకు దూరం పెట్టిన కరోనా కారణంగా తెలుగు సినిమా స్వరూపం మారిపోనుంది. మునుపటిలా థియేటర్లలో మాస్ ఆడియన్స్ని మెప్పించి పాస్ అయిపోయే కంటెంట్ మీద నిర్మాతలు ఆసక్తి కోల్పోయారు. మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పటికి మామూలుగా రన్ అవుతాయనేది అనుమానంగానే వున్న నేపథ్యంలో వివిధ భాషల్లో వైవిధ్యభరిత సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకులకు రొటీన్ కంటెంట్ ఇస్తే ముప్పు తప్పదని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ఫార్ములా కథలు చెబుతోన్న సీనియర్ దర్శకుల కంటే కొత్త ఆలోచనలతో వస్తోన్న యువతరాన్ని ఆదరిస్తున్నారు. ఇదివరకటిలా మూడు నుంచి అయిదు కోట్లు పెట్టి సినిమా తీస్తే అది మొత్తం బూడిదలో పోసినట్టే అనే భయం ఇప్పుడు లేదు. అలాంటి లో బడ్జెట్ సినిమాలు కొనడానికి కావాల్సినన్ని ఓటిటి కంపెనీలున్నాయి.
దీంతో ఇలాంటి సినిమాలు తీయమని బడా నిర్మాతలే ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటిటి సినిమాలంటే కేవలం థ్రిల్లర్లు, రియలిజమ్ అక్కర్లేదని… మిడిల్ క్లాస్ మెలొడీస్, కృష్ణ అండ్ హిజ్ లీల లాంటి ఎంటర్టైనర్లు కూడా బాగా ఆదరణ పొందుతాయని రుజువవడంతో అలాంటి సహజమైన కథాంశాలను పట్టుకు రమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆ తరహా చిత్రాలు పదుల సంఖ్యలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ద్వితియార్థం నుంచి తెలుగు సినీ పరిశ్రమ నుంచి సినీ సునామీనే వీక్షించవచ్చునని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.