మహేష్ పెద్ద మనసు.. మేకప్‌మ్యాన్‌ మాటల్లో

టాలీవుడ్ ఫేమస్ మేకప్‌మ్యాన్‌లలో పట్టాభి ఒకరు. ఈ పేరును తెరపై చాలాసార్లు చూసి ఉంటారు కానీ.. వ్యక్తి ఎవరన్నది జనాలకు తెలియదు. ఇతను మహేష్ బాబుకు పర్సనల్ మేకప్ మ్యాన్. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కూడా ఒకప్పుడు పట్టాభి మేకప్ వేశారు. మహేష్ చిన్నతనంలో నటనలోకి అడుగు పెట్టినపుడు కృష్ణ ఈయనతో మేకప్ వేయించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మహేష్ పెద్దవాడై హీరో అయ్యాక అతడి పర్సనల్ మేకప్ మ్యాన్‌గా మారాడు. ట్రెండు మారినా సరే.. మహేష్ మాత్రం ఈ సీనియర్ మేకప్‌మ్యాన్‌తోనే సాగిపోతున్నారు.

ఐతే ప్రొఫెషనల్‌గానే కాక వ్యక్తిగతంగానూ మహేష్‌కు పట్టాభి చాలా దగ్గరి వాడు. అతడి కుటుంబాన్ని అన్నీ తానై చూసుకుంటాడట మహేష్. ఇంతవరకు ఆర్థికంగా తనకు ఏ లోటూ లేకుండా చూసుకున్నాడని, తన కొడుకును మెడిసిన్ చదివిస్తున్నది కూడా మహేష్‌ అని పట్టాభి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘అసలు మా అబ్బాయిని మెడిసిన్‌ చదివించమని సలహా ఇచ్చింది మహేషే. కోర్సులో చేర్చాను కానీ ఫీజు కట్టే సమయానికి అవసరమైనంత డబ్బు నా దగ్గర లేదు. చాలా పెద్ద మొత్తం కాబట్టి వేరే ఎవరినీ అడగలేకపోయాను. ధైర్యం చేసి మహేష్‌ను సాయం అడిగా. డబ్బులవసరమని, వీలైంత త్వరగా తిరిగిచ్చేస్తానని మహేష్‌కు చెప్పా. ఆయన ఏ కాలేజీ అని వివరాలడిగి ఊరుకున్నారు. ఏం మాట్లాడలేదు.

తర్వాత నమ్రత గారి నుంచి ఫోన్‌ వచ్చింది. వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత మహేష్‌ నన్ను పిలిచి.. ‘‘మీ అబ్బాయి చేరుతున్నది మంచి కాలేజే. ఒక్క షరతు మీద నీకు మొత్తం డబ్బులిస్తా’’ అన్నారు. నాకు టెన్షన్‌ పెరిగిపోయింది. ‘‘ఈ డబ్బులు అప్పుగా ఇవ్వను. నువ్వు నాకు తిరిగి ఇవ్వనంటేనే ఇస్తా..’’ అన్నారు. నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను మహేష్‌ ఇచ్చిన చెక్కును తీసుకెళ్లి కాలేజీలో ఇస్తే వాళ్లు అనుమానించారు. మహేష్‌ నుంచి ఉత్తరం ఇస్తే తప్ప చెక్‌ను అంగీకరించమన్నారు. ఆ తర్వాత నమ్రత గారు మా అబ్బాయి చదువుకు స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఇవ్వడంతో వాళ్లు నమ్మారు’’ అని పట్టాభి చెప్పాడు.