Movie News

టాలీవుడ్ 2025 – ది కంప్లీట్ రివ్యూ

ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తూ, ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తూ 2025 సెలవు తీసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు సంబంధించి ఈసారి ఉగాది పచ్చడిలా తీపి కన్నా చేదు ఎక్కువ కావడం నిర్మాతలను కలవపరిచింది. ఒకపక్క కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడితే ఇంకోవైపు కొన్ని ప్యాన్ ఇండియా మూవీస్ బయ్యర్లకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే అటు ఉత్తమ సంవత్సరం అనిపించుకోక, బ్యాడ్ ఇయర్ ముద్ర వేయించుకోలేక మధ్యలో ఉండిపోయింది. ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యుస్ లా నిలిచిపోయిన 2025ని ఒకసారి రివ్యూ చేసుకుందాం.

జనవరి

మలయాళం డబ్బింగ్ ‘మార్కో’తో తొలి రోజు మొదలయ్యింది. ఒరిజినల్ వెర్షన్ సెన్సేషన్ సృష్టించినప్పటికీ ఇక్కడ మాత్రం ఆశించిన స్పందన అందుకోలేదు. దీంతో పాటు వచ్చిన కథా కమామీషు, నీలిమేఘశ్యామని ఆడియన్స్ పట్టించుకోలేదు. మూడు వందల కోట్లతో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవగా బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. అంచనాలకు మించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇండస్ట్రీ హిట్ (ఆ రోజుకి) కావడం ఎవరూ ఊహించనిది. వెంకీ టైమింగ్, రావిపూడి కామెడీ రెండు కలిసి థియేటర్లను జాతరగా మార్చేశాయి. ఈ నెలలో వచ్చిన మిగిలిన చిన్న సినిమాలన్నీ పూర్తిగా టపా కట్టేశాయి.

ఫిబ్రవరి

సక్సెస్ కోసం తపించిపోతున్న నాగచైతన్యకు ‘తండేల్’ విజయం గొప్ప ఊరటనిచ్చింది. వంద కోట్ల గ్రాస్ తో తన కలను నెరవేర్చింది. విశ్వక్ సేన్ ‘లైలా’ తీవ్ర విమర్శలతో వాషౌట్ అయిపోగా ‘బ్రహ్మ ఆనందం’కు ప్రశంసల ఆనందం తప్ప డబ్బుల సంతోషం మిగల్లేదు. ప్రదీప్ రంగనాథన్ డబ్బింగ్ మూవీ ‘రిటర్న్ అఫ్ ది డ్రాగన్’ కమర్షియల్ గా సేఫ్ అయిపోగా ధనరాజ్ దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ మెప్పులు తప్ప సొమ్ములు తేలేకపోయింది. అది పినిశెట్టి శబ్దం, ధనుష్ డైరెక్ట్ చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఫ్లాప్ అయ్యాయి. సందీప్ కిషన్ కు ‘మజాకా’ మాములు షాక్ ఇవ్వలేదు. ఊపుమీదున్న దర్శకుడు త్రినాథరావుకి పెద్ద బ్రేక్ వేసింది.

మార్చి

నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అఫ్ ది మంత్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ అద్భుతాలు సృష్టించిన ఈ సీరియస్ డ్రామాకు ఆడియన్స్ ఫస్ట్ క్లాస్ మార్కులు వేశారు. డిస్ట్రిబ్యూటర్లను ఫుల్ హ్యాపీ చేసిన కొద్ది సినిమాల్లో కోర్ట్ ది అగ్ర స్థానం. కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ని జనం దుబారా వద్దని తిరస్కరించగా నితిన్ ‘రాబిన్ హుడ్’ కనీస అంచనాలు అందుకోలేక ఫస్ట్ డేనే చేతులు ఎత్తేసింది. తమిళ మలయాళంలో బాగా ఆడిన ఎల్2 ఎంపురాన్, వీరధీరశూరన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇక్కడ రిజెక్షన్ కు గురయ్యాయి. అనువాదం లేట్ అయినా బాలీవుడ్ మూవీ ‘చావా’ని మన పబ్లిక్ బాగా ఆదరించారు. మరో ప్రాఫిటబుల్ వెంచర్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ మంచి లాభాలిచ్చింది.

ఏప్రిల్

సిద్ధూ జొన్నలగడ్డకు పెద్ద వార్నింగ్ బెల్ లా నిలిచిన ‘జాక్’ ప్రొడ్యూసర్ కు తెచ్చిన నష్టాల దెబ్బకు హీరో కొంత రెమ్యునరేషన్ వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. యాంకర్ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమన్నా ఓదెల 2, కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ప్రియదర్శి సారంగపాణి జాతకం ఎన్ని పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసినా బాక్సాఫీస్ వద్ద పరాభవమే ఎదురయ్యింది. ఉన్నంతలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మోస్తరు వసూళ్లు తేగా సన్నీ డియోల్ ‘జాక్’ నార్త్ లో ఆడినంతగా మన దగ్గర పట్టించుకోలేదు. చౌర్య పాఠం, సోదరా, డియర్ ఉమ లాంటి విభిన్న ప్రయత్నాలకు దక్కిన ఫలితం సున్నా. కంటెంట్ వీక్ గా ఉండటంతో కనీస ఆదరణకు నోచుకోలేకపోయాయి.

మే

న్యాచురల్ స్టార్ నాని ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ జస్ట్ హిట్ దగ్గర ఆగిపోయి ఓకే అనిపించుకుంది. రెవిన్యూ పరంగా మునుపటి రెండు భాగాల కంటే మెరుగ్గా కలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం నాని ఇమేజ్, మేకోవరే. శ్రీవిష్ణు ‘సింగిల్’ దానికి జరిగిన బిజినెస్ కు తగ్గట్టు ఫాస్ట్ రికవరీ చేసేసింది. సింపుల్ బడ్జెట్, కూల్ కంటెంట్ తో అందరినీ సేవ్ చేసింది. సూర్య ‘రెట్రో’ని జనం భరించలేకపోయారు. సమంత నిర్మించిన ‘శుభం’కు హడావిడి చేయడం వల్ల ఓ మోస్తరుగా డబ్బులు వచ్చాయి కానీ థియేట్రికల్ గా చూసుకుంటే సోసోగానే ఆడింది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘భైరవం’ ఒక్క మంచు మనోజ్ తిరిగి వచ్చాడని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడింది.

జూన్

నాగార్జున – ధనుష్ తొలి కలయిక ‘కుబేర’ ప్రశంసలు, కలెక్షన్లు రెండూ అందుకుంది. యునానిమస్ కాకపోయినా బాగాలేదని అనిపించుకోకుండా శేఖర్ కమ్ముల తన మార్క్ చూపించారు. మంచు విష్ణు ‘కన్నప్ప’ అంత పెద్ద క్యాస్టింగ్ తోనూ మేజిక్ చేయలేకపోయింది. ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడంలో తడబడి ఆగిపోయింది. మైత్రి నిర్మించిన ‘8 వసంతాలు’కు సోషల్ మీడియా హైప్ వచ్చినా టికెట్లు కొనే బజ్ రాలేదు. కమల్ హాసన్ ‘తగ్ లైఫ్’ రెండో రోజుకే టపా కట్టేయగా విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ ఓకే అనిపించుకుని కాసిన్ని సొమ్ములు చేసింది. చిన్న సినిమాలన్నీ కనీసం ఊసులో లేకుండా పోయాయి.

జూలై

నిర్మాత దిల్ రాజు గొప్పగా చెప్పుకున్న ‘తమ్ముడు’ ఘోరంగా ఫెయిలవ్వడం నితిన్ కెరీర్ ని డిఫెన్స్ లో పడేసింది. సుశాంత్ ఓ భామ అయ్యో రామా, ఉప్పు కప్పురంబు (ఓటిటి రిలీజ్) వచ్చిన సంగతే తెలియనంతగా మాయమైపోయాయి. సిద్దార్థ్ ‘3 బిహెచ్కె’కి ప్రచారాలు గట్టిగానే చేసినా మనోళ్లకు కాన్సెప్ట్ ఎక్కలేదు. టీవీ నటుడు సాగర్ ‘ది 100’ మీద కొంత సానుకూలత కనిపించినా అది కాసులు కురిపించే దిశగా వెళ్ళలేదు. నెల మొత్తంలో చెప్పుకోవాల్సిన ఫ్లాప్ ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ కెరీర్ ని అమాంతం పైకి తీసుకెళ్తుందని భావిస్తే సితార సంస్థకు పెద్ద ఝలక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చేసిన గాయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ అంచనాలకు మించి ఆడేసింది. ఇదొక అద్భుతమని చెప్పాలి.

ఆగస్ట్

ఇండిపెండెన్స్ డేకి వచ్చే పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకుని మొదటి రెండు వారాలు పెద్దగా సౌండ్ లేదు. ఆగస్ట్ 14 ఒకే రోజు తలపడిన కూలీ, వార్ 2 అనూహ్యమైన నెగటివ్ ఫలితాలతో దిగ్భ్రాంతికి గురి చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ నిరాశ పరచగా రజని – లోకేష్ కనగరాజ్ కాంబో గురించి ఎంతో ఊహించుకున్న అభిమానులకు డిప్రెషన్ కు గురైనంత పనయ్యింది. వందల కోట్లయితే వచ్చాయి కానీ సూపర్ స్టార్ బెస్ట్ మూవీ లిస్టులో కూలి చేరలేదు. తెలుగులో కూడా దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చింది కానీ లాభాలైతే రాలేదు. డిఫరెంట్ గా చేశామని చెప్పుకున్న అర్జున్ చక్రవర్తి, త్రిబాణధారి బార్బరిక్, నారా రోహిత్ సుందరకాండ, బకాసుర రెస్టారెంట్ యావరేజ్ కూడా అనిపించుకోలేకపోయాయి. కేరళ నెంబర్ వన్ గ్రాసర్ ‘కొత్త లోక చాప్టర్ 1’ ఇక్కడ వీకెండ్ వరకే హడావిడి చేసింది.

సెప్టెంబర్

అనుష్క, దర్శకుడు క్రిష్ కలయికలో రూపొందిన ‘ఘాటీ’ రిలీజ్ కు ముందు కొంత ప్రామిసింగ్ గా అనిపించినా తీరా చూస్తే మొదటి ఆటకే సారీ చెప్పేసింది. అనూహ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా కేవలం మూడు కోట్లతో రూపొంది ముప్పై కోట్లకు పైగా వసూలు చేయడం ఒక కేస్ స్టడీ లాంటిది. సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే మౌళి దెబ్బకు ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. మరో సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’. తేజ సజ్జ నిరీక్షణకు తగ్గ సూపర్ సక్సెస్ ఇచ్చింది. కిష్కిందపురి పాసయిపోవడం సాయిశ్రీనివాస్ కు పెద్ద రిలీఫ్. మదరాసి, భద్రకాళీ భద్రంగా మునిగిపోగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో పవన్ ‘ఓజి’ టాప్ గ్రాసర్ అఫ్ ది ఇయర్ గా నిలవడం విశేషం.

అక్టోబర్

ఈ నెల డబ్బింగ్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉంది. ‘కాంతారా చాప్టర్ 1’ మీద తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం దాన్ని పట్టించుకోలేదు. హిట్టు సింహాసనం ఇచ్చారు. సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ని ప్రేక్షకులు మాకు ఇలాంటి సినిమాలు వద్దు కదా అని తీర్పు ఇచ్చారు. ‘డ్యూడ్’ మరోసారి ప్రదీప్ రంగనాథన్ కు సేఫ్ బెట్ అయ్యింది. కిరణ్ ‘కె ర్యాంప్’ అన్నింటిని డామినేట్ చేయడం ఆ వారంలోని అసలు హైలైట్. కంటెంట్ బాగున్నా శృతి మించిన కుల వివక్ష కారణంగా ‘బైసన్’ని మనోళ్లు లైట్ తీసుకున్నారు. ధనుష్ ఇడ్లి కొట్టు, బన్నీ వాస్ బృందానికి ఆరు కోట్ల నష్టం తెచ్చిన మిత్రమండలి అన్నీ ఫ్లాపే. రవితేజ ‘మాస్ జాతర’ ఈసారైనా మాస్ మహారాజాను గట్టెక్కిస్తుందనుకుంటే మళ్ళీ నిరాశే మిగిలింది

నవంబర్

సుధీర్ బాబు ప్రార్ధన దేవుడికి చేరలేదు. ‘జటాధర’ రూపంలో ఇంకో దెబ్బ తగిలింది. రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీద వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా బాక్సాఫీస్ దగ్గర గెలిచింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకు వచ్చిన పాజిటివ్ టాక్ సరిగా మార్కెట్ చేసుకుని ఉంటే ఇంకా పెద్ద రేంజ్ కు వెళ్ళేది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ‘కాంత’కు రానా దగ్గరుండి ఎంత పుషప్ ఇచ్చినా లాభం లేకపోయింది. సంతాన ప్రాప్తిరస్తు జనాలకు చేరలేదు. అల్లరి నరేష్ ’12ఏ రైల్వేకాలనీ’ మర్చిపోవాల్సిన మెమరీగా నిలిచింది. రాజు వెడ్స్ రాంబాయి మరో స్మాల్ వండర్ అయ్యింది. రామ్ ‘ఆంధ్రకింగ్ తాలూకా’కు ఎంత సపోర్ట్ లభించినా ప్రయోజనం కలగలేదు. ఎనర్జిటిక్ స్టార్ కు మరో యావరేజ్ దక్కింది. ప్రేమంటే, పాంచ్ మినార్, రివాల్వర్ రీటా, జిగ్రీస్, ప్రేమిస్తున్నా మొదలైనవి వర్కౌట్ కాలేదు.

డిసెంబర్

బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం’ అంచనాలు అందుకోలేకపోయినా మూడు వారాలు వీకెండ్స్ సహాయంతో మంచి గ్రాస్ వసూలు చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ అందుకుని లాభాలు ఇచ్చేలా చేయకపోవడం ట్రాజెడీ. ‘ఛాంపియన్’కు స్వప్న సంస్థ పెట్టిన భారీ ఖర్చుకు తగ్గ రెస్పాన్స్ కనిపించలేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘శంబాలా’ క్లియర్ హిట్ గా నిలవగా ‘ఈషా’కు నెగటివ్ టాక్ వచ్చినా గట్టెక్కేసింది. ‘దండోరా’కు శభాష్ లు మాత్రమే మిగిలాయి. రోషన్ కనకాలకు ‘మోగ్లీ’ రూపంలో మరోసారి బ్యాడ్ లక్ పలకరించింది.  మొత్తంగా చూసుకుంటే 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్ లో బాక్సాఫీస్ జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకుంది కానీ ఇండస్ట్రీ కోరుకున్న డిస్టింక్షన్ అయితే దక్కలేదు.

This post was last modified on December 31, 2025 7:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మాట నిల‌బెట్టుకున్న సీఎం.. ఉద్యోగుల‌కు 2026 కానుక‌!

తెలంగాణ ఉద్యోగుల‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త సంవ‌త్స‌రానికి ఒక‌రోజు ముందే భారీ కానుక‌ను ప్ర‌క‌టించింది. గ‌త కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు…

2 hours ago

ప్రభాస్ గురించి జక్కన్న చెప్పింది నిజమే

హీరోల్లో కొందరు బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉంటారు. వాళ్లను అందరూ నటులుగానే చూస్తారు కానీ.. బయటికి కనిపించని వేరే టాలెంట్స్ చాలానే…

3 hours ago

ఫైటింగ్ ముగిసింది… కలిసి ప్రమోషన్లు చేస్తున్నారు

ముందు ‘వానర’ అనే పేరుతో తెరకెక్కి.. రిలీజ్ ముంగిట ‘వనవీర’ అని పేరు మార్చుకుంది ఓ సినిమా. అవినాష్ అనే…

5 hours ago

ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్‌చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026…

5 hours ago

చెన్నైలో నాన్ లోకల్ పరిస్థితి ఇదా?

లోకల్ వెర్సస్ నాన్ లోకల్ గొడవలు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు తమ ఉపాధిని దెబ్బ…

6 hours ago

2025: ఏపీకి పెట్టుబ‌డుల సంవత్సరమే.. !

సాధార‌ణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబ‌డులు వ‌స్తాయి. కానీ.. ఏపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబ‌డుల…

6 hours ago