సూపర్ స్టార్ సినిమాకు దర్శకులే దొరకలేదా?

జైలర్ 2 తర్వాత రజినీకాంత్ చేయబోయే సినిమా మీద సందిగ్ధం ఇంకా తొలగలేదు. కమల్ హాసన్ నిర్మాతగా తలైవర్ రెండు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సుందర్ సి దర్శకుడిగా లాక్ చేసుకుని వీడియో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కొద్దిరోజులయ్యాక అందరికీ షాక్ ఇస్తూ అతను వెనుదిరిగాడు.

తర్వాత పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు వినిపించింది. అఫీషియల్ కాకపోవడంతో ఫ్యాన్స్ అయోమయం చెందారు. ఇప్పుడు డ్రాగన్ తీసిన అశ్వత్ మరిముత్తు ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేయబోతున్నాడనే ప్రచారం చెన్నై వర్గాల్లో ఊపందుకుంది. దీనికీ అధికారిక ముద్ర లేదు.

నిజానికి ఇలాంటి సిచువేషన్ రజినికి ఎప్పుడూ రాలేదు. ఆరోగ్య కారణాల దృష్ట్యా సినిమాల వేగం తగ్గించాలని చూస్తున్న ఈ సూపర్ స్టార్ ఇంకో మూడు నాలుగు సంవత్సరాలలో రిటైర్ మెంట్ ప్రకటన ఇవ్వొచ్చనే గాసిప్ ఆల్రెడీ మొదలయ్యింది. అందుకే కెరీర్ చివర్లో చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట.

కూలి ఫలితం తర్వాత లోకేష్ కనగరాజ్ ని నిర్మొహమాటంగా పక్కన పెట్టడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. జైలర్ 2 వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల కానుంది. షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతున్నప్పటికీ మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్స్ ఇస్తున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

ముందు రజని సోలో మూవీ సంగతి తేలితే తప్ప కమల్ రజని మల్టీస్టారర్ ఒక కొలిక్కి రాదు. ఈ ఇద్దరినీ బాలన్స్ చేయగల సమర్థుడు ఎవరున్నారో అర్థం కాక అభిమానులు తెగ ఖంగారు పడుతున్నారు. రాజమౌళి లాంటి వాళ్ళు చేయగలరు కానీ ఆయన కమిట్ మెంట్స్, సినిమా తీయడానికి తీసుకునే సమయం పరిగణనలోకి తీసుకుంటే సెట్స్ పైకి వెళ్లడం కష్టం.

రజనీకాంత్ టార్గెట్ ఒకటే. వీలైనంత త్వరగా తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీతో సినిమా ఇచ్చే డైరెక్టర్లు కావాలి. ఒక్క నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే ఆయన అంచనాను అందుకున్నారు. మరి నెక్స్ట్ లిస్టులో ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.