ఈగ విలన్ గా మనకు దగ్గరైన కిచ్చ సుదీప్ బాహుబలి, సైరా నరసింహారెడ్డిలో క్యామియోలు చేయడం ద్వారా ఇంకాస్త పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే క్రిస్మస్ పండగ రోజు తన మార్క్ సినిమా రిలీజయ్యింది. గత ఏడాది ఇదే టైంలో చేసిన మ్యాక్స్ కమర్షియల్ గా కన్నడలో పెద్ద సక్సెస్ కావడంతో ఈసారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో అదే దర్శకుడు అదే తరహా టైటిల్ అనిపించే మార్క్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే రిజల్ట్ తేడా కొట్టింది. రివ్యూలు, పబ్లిక్ టాక్ నెగటివ్ గా వచ్చాయి. చాలా రొటీన్ గా ఉందంటూ విమర్శకులు పెదవి విరిచారు. అవుట్ డేటెడ్ అనే పదం ఎక్కువగా వినిపించింది.
ఒకరకంగా చెప్పాలంటే సుదీప్ ఖైదీ హ్యాంగోవర్ లో ఉన్నాడు. ఒక రాత్రి లేదా ఒక రోజులో జరిగే సంఘటనలు ఆధారంగా చేసుకుని సినిమాని నడిపించే ఫార్ములాని అందులో నుంచే తీసుకుని మ్యాక్స్ తీయించాడు. ఏదో ఫ్లోలో ఆడేసింది కదాని ఇప్పుడు మార్క్ తో మళ్ళీ రిపీట్ చేశాడు.
కథ పరంగా చూసుకుంటే అజయ్ అనే సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ నగరంలో వరసగా జరుగుతున్న చిన్న పిల్లల కిడ్నాప్ ముఠాని పట్టుకునేందుకు బయలుదేరతాడు. ఈ క్రమంలో సీఎం కుర్చీ మీద కన్నేసిన రాజకీయ నాయకుడు, ఒక మాఫియా డాన్, ఒక డ్రగ్ లీడర్ లాంటి పాత్రలతో పోరాడాల్సి వస్తుంది. అదే ఈ మార్క్ స్టోరీ.
ఒకవైపు ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి డైరెక్టర్లు న్యూ ఏజ్ మేకింగ్ తో ప్రయోగాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతుంటే సుదీప్ ఇంకా ఇలా ఖైదీ ఫార్మాట్ ని పదే పదే ఫాలో కావడం విచిత్రం. మార్క్ ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ విడుదల చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.
డిసెంబర్ 25 మార్క్ తో పాటు విడుదలైన శివరాజ్ కుమార్ – ఉపేంద్ర 45కి కొంచెం మెరుగైన రెస్పాన్స్ దక్కింది. యునానిమస్ అనిపించుకోకపోయినా విభిన్న ప్రయత్నం అనే ప్రశంసలు దక్కాయి. 45 తెలుగు వెర్షన్ వారం ఆలస్యంగా జనవరి 1 మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఏపీ తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates