దండోరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో శివాజీ తర్వాత క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అంతటితో వివాదం ముగిసిపోలేదు. అప్పటికే శివాజీ మీద మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.
తాను వాడిన రెండు అభ్యంతరకర పదాల విషయంలో మాత్రమే సారీ చెబుతున్నానని.. మిగతా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని శివాజీ తర్వాత వివరణ ఇచ్చాడు. మరోవైపు శివాజీ మీద చిన్మయి, అనసూయ సహా పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రకాష్ రాజ్, నాగబాబు లాంటి వాళ్లు కూడా వచ్చారు. ఇదిలా ఉండగా తనకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో శివాజీ.. వాటికి జవాబిస్తూ కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తన వ్యాఖ్యల విషయంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు స్పందించిన తీరు పట్ల శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. బయట తనకు ఎంతో మద్దతు లభించిందని.. కానీ ఇండస్ట్రీ వాళ్లే తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తన మీద ఇక్కడి వాళ్లకు ఎందుకు ఇంత కోపం ఉందో అర్థం కాలేదని శివాజీ చెప్పాడు.
తనతో చాలా మంచిగా మాట్లాడేవాళ్లు… తన నటనను పొగిడేవాళ్లు కూడా తనకు వ్యతిరేకంగా జూమ్ కాల్స్ పెట్టి రకరకాల కామెంట్లు చేశారని శివాజీ అన్నారు. దాని గురించి తనకు ఏమీ తెలియదని వాళ్లు అనుకుంటున్నారని.. కానీ ఎవరేం మాట్లాడారో తనకు పూర్తిగా తెలుసని శివాజీ అన్నాడు.
తాను ఇండస్ట్రీలోని మహిళల భద్రత గురించే మాట్లాడానని.. ఆ క్రమంలో రెండు పదాలు తప్పుగా దొర్లాయని.. వాటికి క్షమాపణ కూడా చెప్పానని.. అయినా తనను టార్గెట్ చేస్తున్నారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరికీ మంచి మాటలు చెప్పకూడదని… సలహాలూ ఇవ్వకూడదని అర్థమైందని శివాజీ అన్నాడు.
తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఇబ్బంది లేదని… తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని.. తనకు 30 ఎకరాల భూమి ఉందని, వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని శివాజీ అన్నాడు. యదార్థ వాది లోక విరోధి అని నానుడి అని.. తాను ఎవడికీ భయపడే రకాన్ని కాదని.. ఇది పొగరు కాదు ఆత్మాభిమానం అని.. కాలం, కర్మ అన్నింటికీ సమాధానం చెబుతాయని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని శివాజీ వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates