సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 షూటింగ్ సగానికి పైగానే అయిపోయింది. మొదటి భాగం సెంటిమెంట్ వాడుకుంటూ ఇది కూడా వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల చేయాలనే దిశగా ప్లానింగ్ జరుగుతోంది.
క్యామియోలు చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లకు ఈసారి నిడివి పెరగబోతోందని ఆల్రెడీ టాక్ ఉన్న నేపథ్యంలో దీనికి మరిన్ని ఆకర్షణలు తోడవ్వబోతున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జైలర్ 2లో భాగం కాబోతున్నారని లేటెస్ట్ అప్డేట్. విలన్ గా నటిస్తున్న మిథున్ చక్రవర్తి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని లీక్ చేశారు.
ఇది నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2011 షారుఖ్ స్వంత సినిమా రా వన్ లో రజనీకాంత్ అడగ్గానే చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఒరిజినల్ రోబో గెటప్ వేసుకుని ఒక ఫైట్ లో భాగమయ్యారు. రా వన్ ఫలితం డిజాస్టరే కానీ తన మీద ప్రేమతో అతిథి పాత్ర చేసిన రజనీకాంత్ కు షారుఖ్ అప్పటి నుంచే ఋణపడిపోయాడు.
ఇప్పుడు అది తీర్చుకునే అవకాశం జైలర్ 2 రూపంలో దక్కింది. అయితే ఇది బాలకృష్ణ వద్దనుకున్నదా లేక మరొకటా అనేది తెలియాల్సి ఉంది. షారుఖ్ వల్ల జైలర్ 2కి ఉత్తరాదిలో మరింత మార్కెట్ దొరుకుతుంది. అయితే నెల్సన్ దాన్ని ఎలా డిజైన్ చేశాడనేది కీలకం కానుంది.
ఎందుకంటే ఖాన్లు మన సౌత్ సినిమాల్లో గెస్టుగా నటించినప్పుడు వర్కౌట్ అయిన దాఖలాలు తక్కువ. చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ కాస్త చెప్పుకోదగ్గ నిడివిలోనే కనిపించాడు. కానీ రిజల్ట్ మాత్రం సున్నా. ఉత్తరాది ప్రేక్షకులు కండల వీరుడు ఉన్నా సరే మూవీని లైట్ తీసుకున్నారు.
అయితే జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ఉండటం ప్లస్ అవ్వొచ్చు. కోలీవుడ్ లో ఇది మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే అంచనాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. ప్రతి తమిళ ప్యాన్ ఇండియా మూవీకి ఇలా హైప్ చేయడం, తర్వాత అవి చేరుకోలేక అయిదు వందలు దాటగానే ఆగిపోవడం పరిపాటిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates